ఆటోడ్రైవర్ తో వివాహేతర సంబంధం.. భర్త గొంతునులిమి చంపిన భార్య..

First Published | Jun 28, 2023, 10:21 AM IST

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య.. నిద్రపోతున్న భర్త గొంతు నులిమి చంపేసింది. ఆమెను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

వరంగల్ : ఓ భార్య  తన భర్తను అత్యంత కిరాతకంగా గొంతునులిమి చంపేసింది. హత్య జరిగిన రెండు నెలల తరువాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన అప్పట్లో వరంగల్ లో కలకలం రేపింది. ఆమెను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 

ఈ మేరకు మంగళవారంనాడు ఈ కేసుకు సంబందించిన వివరాలను ఎనుమాముల ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఇలా తెలిపారు.  వరంగల్ మూడవ డివిజన్ పైడిపల్లి పరిధిలోని ఆర్ఎన్ఆర్నగర్ కు చెందిన బట్టు వెంకన్న, స్వప్న భార్యాభర్తలు. స్వప్నకి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. 


అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుని ప్రియుడు ప్రశాంత్ సహకారంతో ఏప్రిల్ 21వ తేదీన చంపేసింది.  అయితే, వెంకన్న తమ్ముడు లక్ష్మణ్ అన్న మృతి పై అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోస్టుమార్టం నివేదికలో కూడా వెంకన్న మృతికి గొంతు నులమడమే కారణమని తేలింది. వైద్యులు నిర్ధారించిన ఈ నివేదిక ప్రకారం అనుమానాస్పద మృతి కేసును హత్యగా మార్చారు. ఈ క్రమంలో  వెంకన్నది హత్య అని వెలుగులోకి రావడంతో తాను పట్టుబడతాడని భయపడిన వెంకన్న భార్య స్వప్న పరారయ్యింది. ఆమెను వెతకడం కోసం పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

వీరు తీవ్రంగా గాలించి మంగళవారంనాడు స్వప్నను ఆమెకు సహకరించిన ఆమె ప్రియుడు ప్రశాంతులను ఎనుమాములలో పట్టుకొని, అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి వీరిద్దరిని విచారించగా... ఆటో డ్రైవర్ ప్రశాంత్ తో స్వప్నకు ఉన్న వివాహేతర సంబంధం వెలుగు చూసింది. స్వప్న, వెంకన్న ఉండే కాలనీలోనే ఉండే ఆటో డ్రైవర్ లావుడ్య ప్రశాంత్ తో స్వప్నకు పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ క్రమంలోనే స్వప్న, ప్రశాంత్ లు సన్నిహితంగా ఉండడం కాలనీవాసులు చూశారు. ఆ విషయాన్ని స్వప్న భర్త వెంకన్నకు వారు తెలిపారు. దీంతో వెంకన్న భార్యతో గొడవపడ్డాడు. స్వప్న ఈ విషయాన్ని తన ప్రియుడైన ప్రశాంత్ కి తెలిపింది. వెంకన్న ఉన్నంతకాలం తమకి ఇదే సమస్య ఉంటుందని ప్రశాంత్ తెలిపాడు,. ఎలాగైనా వెంకన్నను చంపాలని పథకం వేశారు.

వెంకన్న ఏప్రిల్ 21వ తేదీన మద్యం తాగి వచ్చి భార్య స్వప్నతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అన్నం తిని పడుకున్నాడు. అతను గాఢనిద్రలోకి వెళ్లిన తరువాత స్వప్న సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రశాంత్ కి ఫోన్ చేసింది. భర్త మళ్ళీ గొడవపడ్డ విషయం చెప్పింది.

‘ఎన్ని రోజులు ఇలా వేధింపులకు గురవుతావు.. నేనున్నాను కదా.. వస్తున్నాను ఉండు.. వాడిని ఎలాగైనా అంతం చేస్తా’నని చెప్పాడు..  ప్రశాంత్ చెప్పిన మాటలతో స్వప్న నిద్రలో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది. ఈ మేరకు స్వప్న ప్రశాంత్ లపైన కేసు నమోదు చేశారు పోలీసులు.  వీరిద్దరినీ డిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Latest Videos

click me!