
Telangana High Court Chief Justice Aparesh Kumar Singh : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆయనను సుప్రీంకోర్టు కొలిజియం సిపారసు మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో జస్టిస్ అపరేష్ కుమార్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ ను కోల్ కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ 1965 జులై 7న డాక్టర్ రాంగోపాల్ సింగ్, డాక్టర్ శ్రద్ద సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన తల్లిదండ్రులే కాదు కుటుంబం మొత్తం ఉన్నత విద్యావంతులే... ఇలాంటి కుటుంబ నేపథ్యం కలిగిన అపరేష్ సింగ్ కూడా చిన్నప్పటినుండి చదువులో చురుగ్గా ఉండేవారు... ఇలా ఆయన ప్రాథమిక స్థాయినుండి మంచి విద్యార్థిగా గుర్తింపుపొందారు.
జస్టిస్ అపరేష్ కుమార్ ఉన్నత విద్యాభ్యాసం దేశ రాజధాని డిల్లీలో కొనసాగింది. కుటుంబంలో న్యాయ వ్యవస్థలో కీలక స్థానాల్లో పనిచేసినవారు ఉండటంతో ఈయన కూడా న్యాయశాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. ఇలా డిల్లీ విశ్వవిద్యాలయం నుండి బిఏ ఆనర్స్ తర్వాత ఎల్‌ఎల్‌బి పూర్తిచేసారు. అనంతరం న్యాయవాదిగా ప్రాక్టిస్ ప్రారంభించారు.
పాట్నా (బిహార్) హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు అపరేష్ కుమార్. 1990 నుండి 2000 వరకు పాట్నా హైకోర్టు, 2001 నుండి 2012 వరకు జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఈ సమయంలోనే సక్సెస్ ఫుల్ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు... ఆయన వాదించారంటే గెలుపు ఖాయం అనే ప్రచారం ఉండేది. ఇలా న్యాయవాదిగా ఉన్న ఆయన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
పనిచేసిన జార్ఖండ్ హైకోర్టులోనే 2012 లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ అపరేష్ కుమార్. రెండేళ్లు తిరిగేసరికి అంటే 2014 లో ఇదే జార్ఖండ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022లో ఇదే హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయన 2023 లో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుండి తాజాగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.
తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అపరేష్ కుమార్ కుటుంబమంతా ఉన్నత విద్యావంతులే.. మరీముఖ్యంగా న్యాయ వ్యవస్థలో చాలా కీలక స్థానాల్లో పనిచేసినవారు ఉన్నారు. భారతదేశ సుప్రీంకోర్టుకు ఆరవ ప్రధాన న్యాయమూర్తి పనిచేసిన జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా ఈయన ముత్తాతే. ఇక ఈయన తాత జస్టిస్ శంభుప్రసాద్ సింగ్ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు.
ఇక జస్టిస్ అపరేష్ కుమార్ మేనమామలు కూడా సుప్రీం కోర్టులో జడ్జిలుగా పనిచేసారు. జస్టిస్ బిశ్వేశ్వర్ ప్రసాద్ సింగ్ (2001-2007), జస్టిస్ శివకీర్తి సింగ్ (2013-2016) వరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులగా సేవలందించారు.
ఇలా తాతలు, మేనమామలే కాదు జస్టిస్ అపరేష్ కుమార్ కుటుంబంలో ఇంకా చాలామంది న్యాయ వ్యవస్థలో పనిచేసారు... పని చేస్తున్నవారు ఉన్నారు. వీరందరినీ చూస్తూ పెరిగిన అపరేష్ కుమార్ కూడా న్యాయ వ్యవస్థలోకే వచ్చారు. ఇప్పుడు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా కీలక బాధ్యతలు చేపట్టారు.
జస్టిస్ అపరేష్ కుమార్ తో పాటు చాలామంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈయన తెలంగాణకు బదిలీకావడంతో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును నియమించింది కొలిజియం. ఈయన జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేవారు... ఈ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ జడ్జ్ తార్లోక్ సింగ్ చౌహాన్ ను నియమించింది.
మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిన్ కేఆర్ శ్రీరామ్ ను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ సంజయ్ సచ్దేవ్ మధ్యప్రదేశ్ హైకోర్టు, జస్టిస్ విభు బఖ్రు కర్ణాటక హైకోర్టు, జస్టిస్ అశుతోష్ కుమార్ గౌహతి హైకోర్టు, విపుల్ మనుభాయి పంచోలి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.