CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 10-15% కోత విధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆ మొత్తం వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తూ, ఆయన కొత్త చట్టానికి సంకేతాలు ఇచ్చారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనంలో 10 నుండి 15 శాతం వరకు కోత విధిస్తామని హెచ్చరించారు. ఆ మొత్తం నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. “పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేయడం, తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఉద్యోగి కర్తవ్యం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
25
తల్లిదండ్రుల కోసం కొత్త చట్టం
“ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, జీతంలో కోత విధిస్తాం. మీరు ఒకటో తేదీన జీతం పొందినట్లే, అదే రోజు మీ తల్లిదండ్రుల ఖాతాలో ఆ మొత్తం జమ అవుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టం అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ ఆలోచన సమాజంలో సానుకూల మార్పును తీసుకువస్తుందని, వృద్ధుల జీవన స్థితిని మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం సూచన మేరకు అధికారులు ఈ చట్టంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ, తగిన నివేదికను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు.
35
తెలంగాణ ఉద్యమ త్యాగాలను గుర్తు చేసిన రేవంత్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, యాదయ్య వంటి ఉద్యమకారులను స్మరించారు. “వేలాది విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఉంటూ తెలంగాణ కోసం పోరాడారు. కానీ ఆ సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అంటూ ప్రజలను మోసం చేశారు” అని ఆయన విమర్శించారు.
గత పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంపై కన్నా తమ కుటుంబాల సంపద పైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “వారి పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులు విఫలమయ్యాయి. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోవడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు” అని మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు గుప్పించారు.
“ఇప్పటి వరకు మీరు సామాన్యులు, ఇకమీదట అధికారులు. మీ బాధ్యత Telangana Rising 2047 విజన్‌కు అనుగుణంగా పనిచేయడం” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే, ఉద్యోగులకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ.. “నిస్సహాయులకు సహాయం చేయండి, పేదలకు అండగా ఉండండి. తల్లిదండ్రుల సేవే నిజమైన పుణ్యం” అని పిలుపునిచ్చారు.
అదే కార్యక్రమంలో సీఎం, విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటే కొందరు రాజకీయ నాయకులు సంతోషపడుతున్నారు. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండండి. విద్యార్థుల ప్రాణాలు కాపాడటమే మీ మొదటి కర్తవ్యం” అని సూచించారు.
55
భవిష్యత్ నియామకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సీఎం రేవంత్ నియామకాలపై మాట్లాడుతూ.. గ్రూప్-1 ఫలితాలను దసరాకు ముందు విడుదల చేశామని, ఇప్పుడు దీపావళికి ముందు గ్రూప్-2 నియామకాలు పూర్తిచేశామని తెలిపారు. త్వరలో గ్రూప్-3, గ్రూప్-4 ఫలితాలను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే 60 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందని గర్వంగా చెప్పారు.
“రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరంతా మట్టిలో మాణిక్యాల్లా మెరవాలని ఆశిస్తున్నాను. కష్టపడి పనిచేసి తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలపండి” అని సీఎం ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు.