ది రైస్ ఆఫ్ అనుముల రేవంత్ రెడ్డి.. !

First Published | Dec 6, 2023, 4:49 PM IST

Anumula Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రాజకీయాల్లోకి వచ్చిన అనుముల రేవంత్ రెడ్డి.. కేవలం 17 ఏళ్లలో అత్యున్నత సీఎం ప‌ద‌వి స్థానం చేరుకున్నారు. ఎలాంటి పరిపాలనా అనుభవం లేని, ఎప్పుడూ అధికార పార్టీలో లేని నాయకుడికి ఇది అసాధారణ విజయమని చెప్ప‌వ‌చ్చు.
 

Telangana CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మూడేళ్లలోనే పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన నాయ‌కుడు అనుమ‌ల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్న ఆయ‌న రాజ‌కీయ, వ్యక్తిగ‌త‌ జీవితం గ‌మ‌నిస్తే ఎంతో ఆస‌క్తిక‌రంగానూ, కొన్ని సంఘ‌ట‌న‌లు విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. మారుమూల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు అనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఆస‌క్తిక‌రంగా సాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రాజకీయాల్లోకి వచ్చిన ఆయ‌న.. కేవలం 17 ఏళ్లలో అత్యున్నత సీఎం ప‌ద‌వి స్థానం చేరుకున్నారు. ఎలాంటి పరిపాలనా అనుభవం లేని, ఎప్పుడూ అధికార పార్టీలో లేని నాయకుడికి ఇది అసాధారణ విజయమని చెప్ప‌వ‌చ్చు.
 

అనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు చేర్చి, తాను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ను గద్దె దింపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం కేసీఆర్ ను అధికారం నుంచి దింపుతాన‌ని రేవంత్ శపథం చేశారు. విచిత్రమేమిటంటే రేవంత్ రెడ్డి రాజ‌కీయ  ప్రస్థానం మరెవరో కాదు కేసీఆర్ హయాంలోనే ప్రారంభించారు. 1969లో మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో రాజకీయేతర కుటుంబంలో జన్మించిన రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదివారు. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విశ్వహిందూలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కుమార్తె గీతను ప్రేమ‌ వివాహం చేసుకున్నారు.

Latest Videos


రాజకీయల్లో దూకుడు.. 

రేవంత్ రెడ్డి రాజ‌కీయాల్లో దూకుడుకు పెట్టింది పేరు. త‌న‌దైన త‌ర‌హాలో రాజ‌కీయ జీవంత ప్రారంభించి త‌క్కువ కాలంలోనే సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ తర్వాత 2001లో రేవంత్ తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు.  అయితే, ఆయ‌న‌కు టిక్కెట్ నిరాక‌రించ‌డంతో 2007లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి విధేయుడిగా మారారు. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 
 

తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా టీడీపీకి శాసనసభలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను శాసించాలని కలలు కంటున్న చంద్రబాబు తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ను నియమించారు. అయితే, అప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు భిన్నంగా మారుతున్న తీరుపై రేవంత్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మార్పు పవనాలు వీస్తాయని, తెలంగాణ నుంచి టీడీపీ మొత్తం మాయం  అవుతుందన్న క్ర‌మంలో రేవంత్ పలువురు టీడీపీ నేతలతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఇక‌ 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ ఓడిపోయారు.

లంచం తీసుకుంటూ.. 

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం వల్ల టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) భారీగా నష్టపోయే అవకాశం ఉందనేది కేసీఆర్ కు బాగా తెలుసు. చాకచక్యమైన రాజకీయాలతో పాటు, రేవంత్ గొప్ప వక్త. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ కూడా భారీ జనాన్ని ఆకర్షించగలరు. గత ఏడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇది కనిపించింది. అలాగే, చాలా బ‌హిరంగ స‌భ‌ల్లో, అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి త‌న వాక్ చాతుర్యంతో ముందున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కావ‌డం కంటే కేసీఆర్ గ‌ద్దె దించాల‌నేది చాలా సార్లు రేవంత్ ప్ర‌స్తావించారు. 2015లో ఓ ప్రభుత్వ అధికారికి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత ఈ కోరిక మరింత బలపడింది. దీనికి కార‌ణం తన ఒక్కగానొక్క బిడ్డకు వివాహం జరుగుతున్న సమయంలోనే జైలుకు పంపారు. అయితే కొన్ని గంటల పాటు పెళ్లికి హాజరయ్యేందుకు అనుమతించారు.

జైలు జీవితం కూడా గ‌డిపారు. అయితే, చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ను సర్వనాశనం చేస్తానని రేవంత్ శపథం చేశారు. జైలు ఆవరణలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన జనాన్నిద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ను గద్దె దించి, ఆయన కుటుంబాన్ని రాజకీయాల్లో అప్రస్తుతం చేయడమే తన జీవిత అజెండాగా పేర్కొన్నారు. 
 

అంతర్గత కుమ్ములాటలను అధిగమిస్తూ..

2017లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గాలివీస్తున్న స‌మ‌యంలో తెలంగాణ‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను ఎద‌ర్కొంటున్న స‌మ‌యం. అలాంటి స‌మ‌యంలో రేవంత్ కాంగ్రెస్ ను ముందుండి న‌డిపించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. గత ఐదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనే ఏకైక నేతగా రేవంత్ గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకే ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. భారత్ జోడో యాత్రలో రేవంత్ ను తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏ నాయకులు తమ నియోజకవర్గానికి రావాలో ప్లాన్ చేస్తున్నప్పుడు అందరూ రేవంత్ రెడ్డిని అడిగారని కర్ణాటక కాంగ్రెస్ నేత‌లు మీడియాతో చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
 

కానీ అది సాఫీగా సాగలేదు. రేవంత్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఏకీభవించడం లేదు. కోమటిరెడ్డి సోదరులు వెంకట్, రాజ్ గోపాల్ లకు రేవంత్ అంటే అంతగా ఇష్టం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు టి.జయప్రకాశ్ రెడ్డి, గతంలో పార్టీలో సీనియర్ పదవులు నిర్వహించిన వి.హనుమంతరావులు రేవంత్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై కూడా అసంతృప్తిని వ్య‌క్తిచేసిన వారే. అయితే, త‌న‌దైన రాజ‌కీయ వ్యూహంతో ఎన్నిక‌ల వేళ అందరిని క‌లుపుకుంటూ తెల‌గాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంలో రేవంత్ రెడ్డి ప్ర‌ధాన భూమిక పోషించారు. ఇప్పుడు తెలంగాణలో అత్యున్నత రాజకీయ పాత్ర పోషించేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్.. బ‌ల‌మైన నాయ‌క‌త్వం క‌లిగిన కేసీఆర్ పార్టీని ఓడించ‌గ‌లిగింది. ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా రాష్ట్రాన్ని న‌డిపించ‌డానికి రేవంత్ సిద్ధ‌మ‌య్యారు.. ! 

click me!