
Andhra Pradesh and Telangana Weather Updates : ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురిశాయి. వారం పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు నేల తడిసింది. వర్షాకాలం మొదలైన నెల నెలన్నర రోజులు వానలు కురవకపోవడంతో ప్రజలు కంగారుపడ్డారు... ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వారికి ఊరటనిచ్చాయి. మరీముఖ్యంగా తెలుగు రైతుల ముఖాల్లో చిరునవ్వు నింపాయి ఈ వర్షాలు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో జులై 17 నుండి వర్షాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఇరురాష్ట్రాల్లోనూ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి నదులు, వాగులువంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. చాలాప్రాంతాల్లో రోడ్లు, వంతెనపైనుండి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునగడం, వరదనీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు ఎదురయ్యాయి.
ఇలా గతవారం భారీ వర్షాలతో ముగిసింది... మరి ఈవారం వర్షాల పరిస్థితేంటి? తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణం ఎలా ఉంటుంది? ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లోని జలాశయాల పరిస్థితేంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో గత వారమంతా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే నిన్నటినుండి(జులై 27) వాతావరణ మారిపోయింది... వర్షాలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ తో సహా చాలా జిల్లాల్లో ఆదివారం వర్షాల జాడలేదు... కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు జల్లులు కురిశాయి. ఇదే పరిస్థితి ఇవాళ (సోమవారం) కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వారంరోజులు చిరుజల్లులు మినహా భారీ వర్షాలుండవని ప్రకటించారు.
ఇక జులైలో వర్షాలు ముగిసినట్లే... ఆగస్ట్ సెకండ్ వీక్ లో మళ్లీ భారీవర్షాలుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఆగస్ట్ 9-12 తర్వాత తెలంగాణవ్యాప్తంగా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. అప్పటివరకు చిరుజల్లులే ఉంటాయని వెల్లడించారు.
ఇదిలాఉంటే ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైన సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.33 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అత్యవసర పనుల కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ నిధులను వినియోగించుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇక జులైలో భారీవర్షాలు కురిసే అవకాశాలు లేవని… చిరుజల్లులే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. మిగతాజిల్లాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది. ఈ నెలంతా ఇదే వాతావరణం ఉంటుందని... తిరిగి ఆగస్ట్ లో వర్షాలు మొదలవుతాయని తెలిపింది.
ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని జలాశయాలు నిండిపోయాయి... దీంతో గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది... ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా ఉంది. నిజాంసాగర్, పోచారం, కళ్యాణి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి వరద ప్రవాహం పెరిగింది. దీంతో 175 గేట్లు ఎత్తి 5.49 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది... ప్రస్తుతం ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,18,274 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 93,115 క్యూసెక్కులుగా ఉంది.
జూరాల ప్రాజెక్టుకు కూడా వరద పెరుగుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.08 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 93,962 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.650 మీటర్లకు చేరుకుంది.