తెలంగాణలో 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఆరుగురు మృతి.. పలువురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..

First Published | Jul 28, 2023, 8:42 AM IST

తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు చనిపోయారు. వరద నీటిలో చిక్కుకున్న ఎంతోమందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. 

హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. సిరిసిల్లలో నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ గర్భిణి, పెద్దపల్లి జిల్లాలో 19 మంది కార్మికులను రెస్క్యూ టీం రక్షించారు.

హనుమకొండ దర్జీ వీధికి చెందిన బి ప్రేమ్ సాగర్ గురువారం ఉదయం పాలు కొనడానికి వెడుతూ.. కిందపడ్డ కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ ఎన్ కరుణాకర్ తెలిపారు. వర్షానికి తడిసిన రోడ్డుపై విద్యుత్ తీగ తెగిపడడంతో ఈ విషాదం జరిగింది. 


telangana rains

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో గల్లంతయ్యారు. నీటి మట్టం పెరగడంతో వారు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి కొట్టుకుపోయారు. సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు పెద్దవంగర సబ్ ఇన్‌స్పెక్టర్ పి రాజు తెలిపారు.

హనుమకొండ పట్టణంలోని గోపాలపూర్ ప్రాంతానికి చెందిన జి రాజు (40) వరద నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

పొంగిపొర్లుతున్న కొండాయి వాగులో 10 మంది కొట్టుకుపోయారనే పుకార్లు కూడా వ్యాపించాయి. హైదరాబాద్‌లోని మీరాలం ట్యాంక్‌లో గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వరద నీటిలో గల్లంతై, కొట్టుకువచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే, దీన్ని ఏటూరునాగారం పోలీసులు ఖండించారు. ప్రవాహంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తులు చెట్ల కొమ్మల సాయంతో ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో సబితం జలపాతంలో జారిపడి కరీంనగర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఎం వెంకటేష్ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి జలపాతాల దగ్గరకు వెళ్లాడు. వెంకటేష్ నీటిలో మునిగిపోతుండగా స్థానికులు అతని స్నేహితులను రక్షించారు. బుధవారం రాత్రి అతని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

మరో ఉదంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో బుధవారం గ్రామస్థులతో కలిసి వాగు దాటేందుకు ప్రయత్నించిన 56 ఏళ్ల మహిళ కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో కె.సావిత్రి కొట్టుకుపోయింది.

వైరల్ అయిన ఒక వీడియోలో, కొంతమంది మహిళలు ప్రవాహాన్ని దాటడానికి  పొడవైన తాడు కావాలంటూ సహాయం కోసం అరవడం వినిపించింది, అయితే దీనిని ఏర్పాటు చేసేలోగానే.. మిగతావారు నిస్సహాయంగా చూస్తుండగానే సావిత్రి కొట్టుకుపోయింది.

Telangana

కాగా, పలు జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని ఎన్‌డిఆర్‌ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, రెవెన్యూ అధికారులు, నిపుణులైన ఈతగాళ్లతో సహా వివిధ ఏజెన్సీలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పెద్దపల్లిలో ఇసుక క్వారీలో చిక్కుకుపోయిన 19 మంది కూలీలు బయటపడ్డారు. మంథని మండలం గోపాల్‌పూర్‌లోని మానేరు వాగు క్వారీలో ఇరుక్కుపోయారు.జగిత్యాల జిల్లాలోని ఆరు మండలాల్లోని 30 గ్రామాలకు చెందిన 300 మందిని సహాయక బృందాలు సహాయక శిబిరాలకు తరలించారు.

Latest Videos

click me!