
Hyderabad : తెలంగాణలో ఘోర పారిశ్రామిక ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు ఇండస్ట్రియల్ ప్రాంతం పాశమైలారంలో భారీ పేలుడు సంభవించింది. సిగాచి కెమికల్స్ లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 12 మంది చనిపోగా చాలామంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం.
సిగాచి ఇండస్ట్రీస్ లో ప్రస్తుతం ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పటాన్ చెరుతో పాటు సంగారెడ్డి నుండి ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదే సమయంలో గాయపడిన కార్మికులను హాస్పిటల్ కు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరో 15 మంది కార్మికులు ఉన్నారంంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇటీవలకాలంలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా ఈ ఘటన నిలుస్తుంది.
ఈ రియాక్టర్ పేలుడు దాటికి ప్రమాదకర వాయువులు కూడా వెలువడే అవకాశాలున్నాయి... ఇప్పటికే ప్రమాదం జరిగిన ఈ సిగాచి కంపెనీకి పరిసర ప్రాంతాల్లో పొగలు కమ్ముకుని ఘాటు వాసన వ్యాపించింది. దీంతో అక్కడి కార్మికులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాబట్టి ఇటువైపు ఎవరూ రావద్దని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన ఆయన ఈ వాయువులు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రసరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్యకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ దుర్ఘటన విషాదకరమని అన్నారు.
హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి ఇండస్ట్రీస్ రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనలో మరణించినవారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరపున చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారి కుటుంబాలకు రూ.50 వేల ఆర్థికసాయం ప్రకటించారు.
ఉదయం 9 గంటల సమయంలో సరిగ్గా కార్మికులు పనిలో చేరగానే ఈ ప్రమాదం జరిగింది. అందువల్లే ప్రాణనష్టం ఎక్కువ జరిగింది. అయితే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమదానికి కారణమా లేక సాంకేతిక సమస్యలేమైనా తలెత్తాయా? అన్నది తెలియాల్సి ఉంది.
అప్పుడే విధుల్లో చేరిన కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో అందులోని రసాయనాలు, వెలువడిన వాయువుల కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు.
ఈ పేలుడు దాటికి ఓ భవనం కుప్పకూలిపోగా మరో భవనానికి బీటలు వారాయి. కూలిన భవనం శిథిలాల కింద ఇంకా కార్మికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే ప్రమాదకర వాయువులతో పాటు మంటలు చెలరేగడం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఫైర్ సిబ్బందితో ఎన్డిఆర్ఎస్ బలగాలు సహాయక చర్యలు చేపడుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశానికి చెందిన సంస్థ... దీని ప్రధాన కార్యాలయం గుజరాత్ లోని వడోదరలో ఉంది. ఈ కంపనీని 1989లో స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపనీ హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
ఇది మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC) (కలప గుజ్జునుండి వచ్చే ఒక రకమైన సెల్యులోజ్) తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది ఫార్మాస్యూటికల్, ఫుడ్ ఆండ్ న్యూట్రాస్యూటికల్, సౌందర్య సాధనాలు, రసాయనాల తయారీలో ఎంతగానో ఉపయోగపడుతుంది.