
Rahul Gandhi : తెలంగాణలో ప్రస్తుతం కుల రాజకీయాలు నడుస్తున్నాయి. బిసిల కులగణన కోసం చేపట్టిన సర్వేతో ఈ కులాల వివాదం చెలరేగింది. ఓసిలంతా కలిసి మరీ ముఖ్యంగా రెడ్డి పాలకులు బిసిలకు అన్యాయం చేసేలా కులగణన చేయించారని ఎమ్మెల్సీ మల్లన్నలాంటి కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కులగణన నిజాలనే బైటపెట్టింది... అయితే కొందరు ఈ గణనలో పాల్గొనకపోవడంతో లెక్కలు తప్పివుంటాయని అంటోంది. అందుకే మిగిలినవారి వివరాలు నమోదుకోసం మరోసారి కులగణన చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే ఓసి- బిసి, హిందు-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని బిఆర్ఎస్, బిజెపి నాయకులు అంటున్నారు. ఇక ఎస్సిల్లో మాల-మాదిగల మధ్య వివాదం వుండనే వుంది. ఇలా తెలంగాణలో కులమతాల లొల్లి నడుస్తుండగా ఇందులోకి జాతీయ నాయకులను కూడా లాగుతున్నాయి బిజెపి, కాంగ్రెస్ పార్టీలు.
ఇటీవల తెలంగాణ ముఖ్యంమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు మోదీ బిసినే కాదని... ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాకే తన కులాన్ని బిసిల్లోకి మార్చుకున్నారని రేవంత్ అన్నారు. మోదీ కన్వర్టెడ్ బిసి కాబట్టే ఆయనకు బిసిలంటే ప్రేమలేదు... వారి ప్రయోజనాలు పట్టవు కాబట్టే దేశవ్యాప్తంగా బిసి కులగణన చేయించడంలేదని ఆరోపించారు. ప్రధాని కులంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
అసలు రాహుల్ గాంధీది ఏ కులం?
దేశ ప్రధాని మోదీ కులంపై తెలంగాణ సీఎం చేసిన కామెంట్స్ పై చాలామంది బిజెపి నాయకులు రియాక్ట్ అయ్యారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ హీట్ పెంచింది. మోదీ కులంగురించి మాట్లాడేముందు ఓసారి రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలి... ఆయనకు కులం,మతం, జాతి లేదంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అసలు హిందువే కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్... ఆయన ముస్లిం అయితే మనవడు హిందువు ఎలా అవుతాడని అన్నారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నట్లు గాంధీలది బ్రాహ్మణకుటుంబం కాదు... ముస్లిం కుటుంబమని బండి సంజయ్ అన్నారు.
తండ్రి కులమే రాహుల్ కు వర్తిస్తుంది... కాబట్టి తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్ అయినా రాజీవ్ గాంధీ హిందువేనని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు... ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే రాజీవ్ గాంధీ ముస్లిం అని సంజయ్ పేర్కొన్నారు. పార్సీ ముస్లిం కుటుంబానికి చెందిన ఫిరోజ్ ఖాన్, హిందూ కుటుంబానికి చెందిన ఇందిరా గాంధీల కొడుకే రాజీవ్ గాంధీ... తండ్రి ముస్లిం కాబట్టి ఈయన కూడా ముస్లిం అవుతాడు... అప్పుడు ఆయన కొడుకు రాహుల్ గాంధీ కూడా ముస్లింమే కదా అని బండి సంజయ్ అన్నారు.
ముస్లిం మతానికి చెందిన రాహుల్ గాంధీ ఇకనైనా తాను బ్రాహ్మణుడినని చెప్పుకోవడం ఆపాలని బండి సంజయ్ సూచించారు. ఇకపై రాహుల్ ను ముస్లింగా పరిగణిస్తామని... ఆయన కూడా తన తండ్రి,తాతల కులాన్ని అనుసరించాలని సూచించారు. ఆయనను బిసి కులగణన గురించి మాట్లాడే అర్హత లేదని సంజయ్ మండిపడ్డారు.
బిసిల రిజర్వేషన్లు తగ్గించేందుకే కాంగ్రెస్ కుట్ర :
తెలంగాణలో అత్యధికంగా ఉన్న బిసిలకు కులగణన పేరుతో నమ్మించి నట్టేట ముంచేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ అన్నారు. అసలు ముస్లింలను బిసిల్లో కలపడం ఏమిటి? ఇది కుట్ర కాకపోతే ఇంకేటి? అంటూ నిలదీసారు. అంటే ఇప్పుడు బిసిలు తమ రిజర్వేషన్లను ముస్లింలతో పంచుకోవాలా అంటూ రేవంత్ సర్కార్ నిలదీసారు బండి సంజయ్.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పుడు 10 శాతం ముస్లింలను ఇందులో కలిపారు... అంటే అసలైన బిసిలకు దక్కేది కేవలం 32 శాతం రిజర్వేషనే, మిగతా 10 ముస్లింలకు వెళుతుందని సంజయ్ అన్నారు. ఇది బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఎలా అవుతుందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులను నిలదీసారు. బిసిలకు న్యాయం చేస్తామంటూనే తీరని అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసాు.
అయితే తమ నాయకుడు రాహుల్ గాంధీ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కాంగ్రెస్ నాయకులు గరం అవుతున్నారు. మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ లతో పాటు ఇతక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని...బిసిలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు, ఇతర అవకాశాలు దక్కాలన్నదే రాహుల్ గాంధీ ఆకాంక్షగా పేర్కొంటున్నారు. అలాంటి గొప్ప నాయకున్ని పట్టుకుని ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని బండి సంజయ్ పై సీరియస్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు.