School Holiday
School Holiday : తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడ్రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పటికే గత మూడు రోజులుగా (డిసెంబర్ 24,24,26) క్రిస్మస్ సెలవులు వచ్చాయి... ఇప్పుడు మరో మూడ్రోజులు (డిసెంబర్ 27,28,29) సెలవులు వస్తున్నాయి. భారత మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతిచెందారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
క్రిస్మస్ సెలవుల తర్వాత ఇవాళ స్కూళ్లు తెరుచుకోవాల్సి వుంది... కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో సెలవులు కొనసాగుతున్నాయి. ఇక రేపు (శనివారం) కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సాధారణ సెలవు వుంటుంది. తర్వాత ఆదివారం ఎలాగూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు. ఇలా వరుసగా మరో మూడురోజులు తెలంగాణలోని కొన్ని స్కూళ్లకు హాలిడేస్ వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు రేపు(శనివారం) యధావిధిగా నడుస్తాయి.
మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ఈ వారం వరుసగా ఆరురోజులు సెలవులు వచ్చాయి. కేవలం సోమవారం ఒక్కరోజు విద్యాసంస్థలు నడిచాయి. మంగళవారం క్రిస్మస్ ఈవ్, బుధవారం క్రిస్మస్, గురువారం బాక్సింగ్ డే సెలవులు వచ్చాయి. వీటికి మరో మూడురోజుల సెలవులు అదనంగా కలిసివచ్చాయి.
కేవలం విద్యాసంస్థలే కాదు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇవాళ సెలవు ప్రకటించింది రేవంత్ సర్కార్. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఈ సెలవు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏడురోజులు సంతాప దినాలను ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణలో కూడా ఈ సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఆదేశాలు జారీ చేసారు.
Manmohan Singh
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ సంతాపం :
భారత మాజీ ప్రదాని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప నేత మన్మోహన్ సింగ్ మృతి యావత్ దేశాన్ని బాధలోకి నెట్టింది. ఆయన మృతిపై దేశ ప్రజలు, రాజకీయ వ్యాపార సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ప్రధాని మృతిపై సంతాపం తెలిపారు.
దేశం ఇవాళ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది... ప్ఱధానిగానే కాదు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు ఈ దేశం మరిచిపోదని అన్నారు. ఓ అద్యాపకుడిగా, ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేసారని రేవంత్ రెడ్డి కొనియాడారు.
పదేళ్లపాటు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశ అభ్యున్నతి కోసం ఎంతో చేసారని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని అన్నారు. దేశమే కాదు కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకున్ని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
Manmohan Singh
చంద్రబాబు,పవన్ కల్యాణ్ సంతాపం :
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సంతాపం తెలిపారు. మంచి ఆర్థికవేత్త, దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని చంద్రబాబు తెలిపారు. మేధావి మాత్రమే కాదు మంచి పాలకుడైన ఆయన దేశాన్ని దారిద్ర్యం నుండి బయటకు తీసుకువచ్చారు. దేశ ప్రజల జీవితాలను మార్చిన ఆయన మృతి ఈ దేశానికి తీరని లోటని చంద్రబాబు ఎక్స్ వేదికన రియాక్ట్ అయ్యారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మనోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఓ ప్రకటన విడుదల చేసారు. దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఇలాంటి గొప్ప నాయకుడు దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేసారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవన్నారు. మన్మోహన్ సింగ్ మృతితో బాధలో మునిగిపోయిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేసారు.