ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఇటీవల మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఇద్దరు ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటున్నారు. ఓవైపు యువతీయుకుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కట్నకానుకలన్నింటికీ సంబంధించి చర్చలు పూర్తయ్యాయి.
మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోందని అనుకుంటున్న తరుణంలో ఓ ఫోన్ కాల్ వారి జీవితాన్ని మార్చేసింది. ఇటీవల యువతి కాబోయే భర్తతో మాట్లాడుదామని కాల్ చేసింది. అయితే ఆ సమయంలో యువకుడు వేరే కాల్‌లో ఉన్నాడు. దీంతో అవతలి వ్యక్తి కాల్‌ను హోల్డ్ చేసి కాబోయే భార్య కాల్‌ను లిఫ్ట్ చేసి మాట్లాడాడు ఆ యువకుడు. తాను బిజీగా ఉన్నానని చెప్పి కాల్ కట్ చేద్దామనుకున్నాడు.
అయితే కాల్ కట్ చేయాల్సింది పోయి పొరపాటున 'మెర్జింగ్' ఆప్షన్‌ను క్లిక్ చేశాడు. అయితే ఆ యువకుడు ఫోన్‌లో మాట్టాడుతోంది తన ప్రియురాలితో. అంటే అప్పటికే మరో యువతిని ప్రేమిస్తున్న ఆ ప్రబుద్ధుడు పెళ్లికి సిద్ధమయ్యాడన్నమాట. దీంతో మనోడి అసలు విషయం అర్థమైన యువతి సీక్రెట్‌గా వారిద్దరు మాట్లాడుతున్న కాల్‌ను రికార్డ్ చేసింది.
రికార్డ్ చేసిన కాల్‌ని పెద్దలకు వినిపించింది. దీంతో అమ్మాయి తరఫున బంధువులు పెళ్లి రద్దు చేశారు. కట్నం డబ్బులను తిరిగి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా కాన్ఫరెన్సు కాల్‌తో వివాహం కాస్త రద్ధు అయింది. దీంతో ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.