
IMD Rain Alert : నైరుతి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను దాటుకుని బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో విస్తరించాయి... దీంతో మే చివర్లో, లేదంటే జూన్ ఆరంభంలో కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ సముద్రంలో వాతావరణ పరిస్థితులు మారడంతో రుతువనాల కదలిక మందగించిందట... దీంతో కేరళ తీరాన్ని ఆలస్యంగా తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది… అంటే తెలుగు రాష్ట్రాలకు కూడా ఆలస్యంగా వస్తాయన్నమాట.
ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాను పరిస్థితులు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ (జూన్ 1న) కేరళ తీరాన్ని తాకుతాయని అనుకున్న రుతుపవనాలు సముద్రంలోనే చక్కర్లు కొడుతున్నట్లు వెల్లడించింది. ఇవి తీరాన్ని తాకేందుకు మరికొద్దిరోజుల సమయం పట్టవచ్చు. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రుతుపవనాల రాక ఆలస్యం అవుతాయని వెల్లడించారు.
నైరుతి రుతువనాలు భారతదేశంలోకి లేట్ గా ఎంట్రీ ఇవ్వనున్నాయి... కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోకి లేట్ గా ప్రవేశిస్తాయి... అంటే వర్షాకాలం ఆలస్యంగా మొదలవుతుంది. సాధారణంగా జూన్ ఆరంభంలో కేరళను తాకే రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేవి. జూన్ మొదటివారం (జూన్ 5-6 తేదీల్లో) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వాల్సింది... కానీ ఈసారి సెకండ్ వీక్ లో విస్తరిస్తాయంట. అంటే జూన్ 10-12 తేదీల్లో నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయి… ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలంతా విస్తరిస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో ఇక ఎండల తీవ్రత తగ్గుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. జూన్ ఆరంభం నుండి ఎండలు తగ్గుతాయని... ఇప్పటివరకు 46-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా ఈ రెండుమూడు రోజులపాలు 40 డిగ్రీల వరకు నమోదవుతాయట. ఆ తర్వాత కేరళను రుతుపవనాల తాకడంతో వర్షాలు మొదలవుతాయి.. కాబట్టి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని తెలిపారు. ఇలా తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు... సాయంత్రం అయ్యిందంటే చాలు వానలు కురుస్తున్నాయి. ఇలా ఇవాళ (జూన్ 1, సోమవారం) నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఉరుమురు మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జూన్ 2న (మంగళవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
ఆంధ్ర ప్రదేశ్ లో ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో ఇవాళ (సోమవారం) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. పిడుగులు, ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షితమైన భవనాల్లోకి ఆశ్రయం పొందాలని సూచించారు.