హైదరాబాద్ లో కూడా వైన్స్ బంద్ :
తెలంగాణలోని మొత్తం ఏడు జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ స్థానంలో గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 27న ఈ మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
ఇలా ఎన్నికలు జరిగే ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 25 అంటే మంగళవారం సాయంత్రం 4 గంటలకు మద్యం అమ్మకాలు నిలిచిపోతాయి. వైన్స్ తో పాటు బార్లు, పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు చేపట్టడానికి వీల్లేదు. ఫిబ్రవరి 26న పూర్తిగా మద్యం అమ్మకాలు ఉండవు... ఇక ఫిబ్రవరి 27న సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అప్పటివరకు వైన్స్ షట్టర్స్ క్లోజ్ ఉంటాయి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి నగరంలోకి కొన్ని ప్రాంతాల్లో కూడా రేపట్నుంచి మద్యం అమ్మకాలు ఉండవు. పటాన్ చెరు, రామచంద్రాపురం, బీరంగూడ, లింగంపల్లి ప్రాంతాలతో పాటు కొల్లూరులోనూ వైన్స్ మూతపడతాయి.
అయితే కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లోనే మద్యం అమ్మకాలు నిలిపివేస్తారు. మిగతాజిల్లాల్లో యధావిధిగా మద్యం విక్రయాలు జరుగుతాయి. అంటే ఈ మూడురోజులు ఆ ఏడు జిల్లాల ప్రజలు మద్యం సేవించాలంటే బార్డర్ దాటాల్సిందే. ఫిబ్రవరి 26న శివరాత్రి... ఆ రోజు మద్యం దుకాణాలు మూసివుంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై శివభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.