
Telangana : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం నిర్వహిస్తున్న అంగన్వాడీలను మరింత బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే అంగన్వాడీల్లో పిల్లల కేర్ టేకింగ్ తో పాటు గర్భిణి, బాలింత మహిళల సంరక్షణ, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం అంగన్వాడీల్లో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీల్లో ఇక సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పటికే అంగన్వాడీల్లో ఖాళీల వివరాలను సేకరించారు... అంతేకాదు ఉద్యోగాల భర్తీకి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కూడా అనుమతించింది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మెగా అంగన్వాడీ జాబ్స్ రిక్రూట్ మెంట్ చేపట్టేందుకు సిద్దమయ్యారు.
తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల భర్తీ చేపట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు మంత్రి సీతక్క స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తీవ్ర కసరత్తు తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైల్ మంత్రి వద్దకు చేరింది. ఆమె కూడా వెంటనే దానిపై సంతకం చేయడంతో ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవడమే మిగిలింది.
తెలంగాణలో కొలువుల జాతర ... అంగన్వాడీల్లో మెగా రిక్రూట్ మెంట్ :
తెలంగాణలోని చాలా అంగన్వాడీల్లో ప్రస్తుతం సిబ్బంది కొరత ఉంది. చాలాచోట్ల టీచర్లు ఉంటే హెల్పర్ లేరు... హైల్పర్ ఉంటే టీచర్ ఉండరు. వచ్చే విద్యాసంవత్సరం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని... పిల్లలు, గర్బిణి, బాలింత మహిళలు ఇబ్బందిపడకుండా ఉండేలా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది రేవంత్ సర్కార్. ఇందుకోసం ఇప్పటినుండే భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,236 ఉద్యోగాలను అంగన్వాడీల కోసం భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాస్త ఆగాల్సివస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది.
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీని జిల్లాల వారిగా చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలవారిగా అంగన్వాడీల్లో ఖాళీల లిస్ట్ ను స్త్రీ, శిశు సంక్షేమశాఖ సిద్దంచేసింది... వీటి భర్తీకి త్వరలోనే కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు. ఇందులోనే అర్హతలు, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేస్తారు.
అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలకు అర్హతలు :
అంగన్వాడీ ఉద్యోగాలకు కేవలం వివాహిత మహిళలే అర్హులు. అలాగే ఆ అంగన్వాడీ పరిధిలోని స్థిరనివాసం ఉండేవారినే ఎంపికచేస్తారు. పిల్లలతో పాటు గర్భిణి, బాలింత మహిళలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకే స్ధానికులను అంగన్వాడీల్లో ఎంపిక చేస్తారు.
విద్యార్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి చదివిన మహిళలకు ఈ ఉద్యోగాల్లో నియమిస్తారు. అంగన్వాడి టీచర్ కు ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఇంటర్మీడియట్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అంగన్వాడీ హెల్పర్ అయితే పదో తరగతి సరిపోతుంది.
రిజర్వేషన్ ను బట్టి వయో పరిమితిని నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టిలకు 18 నుండి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. జనరల్, బిసి అభ్యర్థులకు 21 నుండి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. దివ్యాంగులు, ఇతర స్పెషల్ రిజర్వేషన్ వారికి వయో పరిమితిలో మరింత సడలింపు ఉంటుంది.
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసిన తర్వాత దరఖాస్తుకు సమయం ఇస్తారు. ప్రత్యేకంగా పోటీ పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను ఎంపికచేసే అవకాశం ఉంటుంది.
అంగన్వాడీ టీచర్లకు జీతం నెలకు రూ.12,500 నుండి 13,500 వరకు ఉంటుంది. హెల్పర్లకు నెల జీతం రూ.8,000 వరకు ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు ప్రభుత్వం ఇతర పనులను కూడా అంగన్వాడీలకు కేటాయిస్తుంది. ఇలా గ్రామాలు, పట్టణాల్లో విద్యాపరమైన వ్యవహారాల్లోనే కాదు పాలనపరమై వ్యవహారాల్లోనూ అంగన్వాడీలను ఉపయోగించుకుంటారు.
అయితే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విధివిధానాలను నోటిఫికేషన్ లో పేర్కొనే అవకాశం ఉంది. అప్పుడు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, జీతభత్యాలు తదితర అంశాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ, ఇప్పుడు కొనసాగుతున్న అంగన్వాడీల వివరాల ఆధారంగా కొంత సమాచారాన్ని అందించగలిగాం. కానీ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు ఉండవచ్చు...గమనించగలరు.