Telangana Budget 2025
Telangana Budget 2025 : రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆదాయ వ్యయాలను అంచనావేసింది ప్రభుత్వం. ఈ మేరకు బడ్జెట్ 2025-26 ను రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసారు... ఈ మొత్తాన్ని శాఖలు, పథకాలవారిగా కేటాయించారు. ఇలా బడ్జెట్ కేటాయింపుల్లో వివిధ పథకాలకు భారీ మొత్తంలో నిధులు దక్కాయి... ఇవి ఈ ఆర్థిక సంవత్సరంలో నేరుగా ప్రజలకు చేరతాయి. అంటే ఈ ఏడాది ప్రజల చేతికి ప్రభుత్వం భారీగా డబ్బులు అందించనుందన్నమాట.
ప్రజలకు నేరుగా డబ్బులు అందించే పలు పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇక పరోక్షంగా ప్రజలకు లబ్ది చేకూర్చే పథకాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఏ పథకానికి రేవంత్ సర్కార్ ఎన్ని నిధులు కేటాయించిందో తెలుసుకుందాం. ఈ పథకాలను మీరు అర్హులయితే మీకు కూడా డబ్బులే డబ్బులు అందుతాయి.
Direct Beneficiary Transfer (DBT)
మీకు నేరుగా డబ్బులు వచ్చే పథకాలివే :
1. రైతు భరోసా :
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కొన్ని పథకాల ద్వారా నేరుగా డబ్బులు అందిస్తుంది. ఇందులో ప్రధానమైనది రైతు భరోసా. వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండుసార్లు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం... ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసేది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రతి ఏడాది ఎకరాకు రూ.15వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇటీవల ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది.
వ్యవసాయం చేసే ప్రతి ఎకరాకు ఏడాదిలో రెండుసార్లు రూ.6 వేల చొప్పున అందిస్తోంది రేవంత్ సర్కార్. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరం భూమికి రూ.12 వేలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈ బడ్జెట్ లో రూ.18,000 కోట్లు కేటాయించారు.
2. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా :
కేవలం వ్యవసాయ భూమి కలిగిన రైతులకే కాదు భూమిలేని పేదలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చినతర్వాత రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం కింద వ్యవసాయ కూలీలకు రూ.12 వేల రూపాయలు చెల్లించనున్నారు. ఈ పథకం ద్వారా భూమిలేని పేద కుటుంబాలకు నేరుగా డబ్బులు అందుతాయి.
3. రాజీవ్ యువ వికాసం :
ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకానికి ఆరువేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆయా కార్పోరేషన్ల ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు గరిష్టంగా రూ.4 లక్షలు సాయం చేయనుంది ప్రభుత్వం. అంటే యువతను వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.
Telangana
4.స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా :
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళకు రూ.2 లక్షలు సహజ మరణ బీమా, రూ. 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది.
5. వివిధ పథకాలకు కేటాయింపులు :
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకానికి ఈ బడ్జెట్ లో రూ. 14,861 కోట్లు కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి (ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం) పథకానికి రూ.4,305 కోట్లు, గృహజ్యోతి (నివాసాలకు 200 యూనిట్లు ఉచిత పవర్) రూ. 2,080 కోట్లు, సన్నరకం వరి పండించే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ కోసం రూ.1,800 కోట్లు కేటాయించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు కేటాయించారు.
ఇక విద్యుత్ సబ్సిడీకి రూ.11,500 కోట్లు, స్కాలర్‌షిప్‌లు & స్టైపెండ్‌ల కోసం రూ.4,452 కోట్లు, కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ కు రూ.3,683 కోట్లు, బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు,
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.2,900 కోట్లు, రైతులకు బీమాకు రూ.1,589 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1,511 కోట్లు, గ్రామాల 100% సోలారైజేషన్ కు రూ.1,500 కోట్లు కేటాయించారు.