కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి: హరీష్ రావు సీరియస్ వ్యాఖ్యలు

First Published | May 18, 2020, 1:02 PM IST

కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంపై ఆర్థికమంత్రి హరీష్ రావు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 

సంగారెడ్డి: కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణ ప్రజలు కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని... కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వారికి అండగా నిలిచారని ఆర్థికమంత్రి హరీష్ రావు తెలిపారు. కష్టకాలంలో వున్న ప్రజలు ఆకలిబాధతో అలమటించకుండా ఒక్కో వ్యక్తికి 12 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వడమే కాదు ప్రతి రేషన్ కార్డుకు రూ.1500 రూపాయలు ఇచ్చారని అన్నారు.ఇందుకోసం ఏకంగా‌ 2500 కోట్లను‌ 2 విడతలుగా పేదల అక్కౌంట్లలో వేశారని హరీష్ రావు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం ఇంత చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని మంత్రి మండిపడ్డారు. కేవలం 5కిలోల బియ్యం ఇచ్చి చేతులు‌ దులుపుకుంది. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు బయటినుండి అప్పులు తెచ్చుకుందామంటే అందుకు అడ్డుపడుతూ కేంద్రం షరతులు విధించిందన్నారు. ఇది రాష్ట్రాల మీద ఒత్తిడి పెంచడమేనని హరీష్ రావు ఆరోపించారు.

సంగారెడ్డి పట్టణంలో ఓ ఫంక్షన్ హాలులో నిరుపేద‌ కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఆర్థిక మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కోవిడ్19 వ్యాప్తి కారణంగా అన్ని‌ సామూహిక కార్యక్రమాలు ఆగిపోయాయన్నారు.దీని వల్ల‌ కళాకారులకు పని లేకుండా పోయిందన్నారు.లాక్ డౌన్ వల్ల‌ వలస‌ కార్మికులు, కళాకారులు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ రంగ కార్మికులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, వంటి‌ వారు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే అనేక మంది దాతలు‌ పేదలకు సాయమందించడానికి ముందుకు వచ్చారని... వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజల‌ సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.కరోనా ఖతం అవుతుంది, కళాకారులకు మంచి రోజులు వస్తాయంటూ మంత్రి భరోసా ఇచ్చారు.
లాక్ డౌన్ నిబంధనలు సడలించి కొంత‌ ఉపశమనం కల్పించే చర్యలు ప్రభుత్వం చేపడుతుందన్నారు.నిబంధనలు ‌సడలించినా కరోనా జాగ్రత్తలు పాటించాలని...స్వీయ నియంత్రణ, బౌతిక దూరం పాటించాలని ప్రజలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Latest Videos

click me!