Huzurabad Bypoll: బొందపెడతానని ఈటల అంటుండు, పెన్షన్ ఇస్తామని మేమంటున్నాం: మంత్రి హరీష్

First Published Oct 18, 2021, 2:28 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీష్ బిజెపిపై, ఈటల రాజేందర్ పై విరుచుకుపడుతున్నారు. 

కరీంనగర్: బొందపెడతా... అగ్గిపెడతా... కూలగొడతామని ఈటల రాజేందర్ అంటుంటే రైతు బంధు ఇస్తాం..పెన్షన్లు  ఇస్తాం... ఐదు వేల ఇళ్లు కడతాం అని మేం అంటున్నామని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నేను గెలిస్తే చాలు... కేవలం నేనే బాగుండాలన్నది రాజేందర్ కోరికయితే గెల్లు గెలవాలి... హుజరాబాద్ ప్రజలు బాగుండాలన్నది తమ కోరికని అన్నారు. కాబట్టి మీ ఓటు ఎవరికో ఆలోచించాలని 
హుజూరాబాద్ ప్రజలకు మంత్రి హరిష్ సూచించారు.
 

సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని బోతాలపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... బిజెపి అభ్యర్థి రాజేందర్ ఎంతసేపూ పెంచి పెద్ద చేసిన కేసీఆర్ ని తిడుతున్నారని అన్నారు. అంతే తప్ప తానేం చేసిండో చెప్పడం లేదన్నారు. ఏడేళ్లు ఢిల్లీలో బిజెపి ప్రభుత్వమే వుంది... రాష్ట్రంలో మేం అధికారంలో ఉన్నాం... ఎవరేం చేసారో ప్రజలు చూసారని హరీష్ పేర్కొన్నారు.  
 

''టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు 200 రూపాయల పెన్షన్ రూ.2016 కు పెంచాం. ఇప్పటివరకు 65ఏళ్లు నిండితే పెన్షన్ వచ్చేది కానీ ఇప్పుడు 57ఏళ్లు నిండగానే పెన్షన్ ఇప్పిస్తామంటున్నాం. పేదింటి ఆడపిల్లకు కళ్యాణలక్ష్మి ద్వారా లక్షా 116 రూపాయలు ఇస్తున్నాం. 18 రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీజేపీ ఎక్కడయినా ఇస్తుందా?" అని ప్రశ్నించారు. 

''కేసీఆర్ కిట్ తో పాటు 12 వేల రూపాయలు ఇచ్చి పేదిండి ఆడబిడ్డ కాన్పు చేయిస్తున్నాం. రైతులకు ఏం చేసామో మీకు తెలుసు. కాళేశ్వరం పూర్తి చేసాక ఎస్సారెస్పీ కాలువల్లో ఫుల్ నీరు వస్తుంది. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ బొంతల పల్లి... 60 ఏళ్ల నీటి కష్టం తీర్చింది కేసీఆర్ కాదా.  యాసంగి పంట వస్తే విద్యుత్ కోతలతో ఎండిపోయేది. ట్రాన్శ్ పార్మర్లు, మోటర్లు కాలి డబ్బులు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు మోటర్లు కాలడం లేదు... ట్రాన్స్ ఫార్మర్లు కాలడం లేదు. నీటి తీరువా రద్దు చేసిండ్రు కేసీఆర్. పాత బకాయిలు రద్దు. ఉచిత విద్యుత్, ఎకరానికి పది వేలు ఇచ్చి రైతు గౌరవాన్ని పెంచిన పార్టీ టీఆర్ఎస్'' అని కొనియాడారు ఈటల. 

''ఇక రాజేందర్ పార్టీ బీజేపీ బావుల కాడ మీటర్లు పెట్టమంటోంది. పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి బావుల కాడ మీటర్లు పెడుతున్నరు. కాని కేసీఆర్ ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని చెప్పాడు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తెచ్చింది బీజేపీ. దేశంలో రైతులంతా కొట్లాడుతున్నారు. యూపీలో రైతులు ధర్నాలు చేస్తుంటే...బీజేపీ నాయకులు కార్లు ఎక్కించితే నలుగురు రైతులు చనిపోయారు. ఇలా రైతుపై బందూకులు ఎత్తిన పార్టీ పక్కన ఉందామా...రైతు బందు టీఆర్ఎస్ పార్టీ పక్కన ఉందామా'' అని అన్నారు హరీష్. 
 

''30వ తేదీ తర్వాత ఉండేది టీఆర్ఎస్ పార్టీ... మనం ఆగం  కావద్దు. స్వంత జాగాలో ఇళ్లు కట్టిస్తాం. రాష్ట్రంలో మంత్రులంతా ఇళ్లు కట్టి.. అర్హులకు ఇళ్లల్లకు తోలినం. అందరు మంత్రులు ఈ పని చేశారు. రాజేందర్ కు పేదలపై ప్రేమ లేదు. అందుకే ఆయన పట్టించుకోలేదు. మంత్రిగా ఒక్క ఇళ్లు కట్టలేదు. మంత్రిగా కట్టని రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కడతాడా...? కాబట్టి గెల్లును గెలిపించండి. పదహేను రోజులకోసారి హుజూరాబాద్ కు వస్తా. ఇళ్లు కట్టిస్తా. జాగా ఉంటే ఐదు లక్షల రూాపాయలు ఇస్తాం. జాగా లేకపోతే ఇళ్లు కట్టించి ఇస్తాం'' అని హరీష్ హామీ ఇచ్చారు. 
 

''రైతు రుణమాఫీ కొంత జరగాల్సి ఉంది. కరోనా వల్ల ఆలస్యం అయింది. రైతుల పై వడ్డీ లేకుండా వచ్చే ఉగాది పండుగ తర్వాత 50 వేల నుంచి లక్ష  రూపాయల రుణం మాఫీ చేస్తాం అని  సీఎం చెప్పారు. చేసి చూపిస్తాం. వానా కాలం వడ్లు తడిసినయి. ఎప్పటి లాగే ఐకేపీ సెంటర్లు పెట్టి వడ్ల కొనుగోలు ప్రారంభిస్తాం'' అని స్ఫష్టం చేసారు.

''57 ఏళ్లు నిండగానే రూ.2016 పెన్షన్ రెండు మూడు నెలల్లో అందిస్తాం. గ్రామంలో కొంత పనులు జరిగాయి. 50 లక్షల రూపాయలు మీ ఊరికి మంజూరు చేస్తాం. మహిళా భవనం రూ.20 లక్షలు ఇచ్చినం.  త్వరగా  భవనాన్ని కట్టించే బాధ్యతను తీసుకుంటాం. మీకిచ్చిన ప్రతీ మాట రెండు సంవత్సరాల్లో నెరువేర్చుతాం'' అని స్పష్టం చేసారు. 
 

''బొందపెడతా...అగ్గిపెడతా...కూలగొడతా.... అంటున్నడు రాజేందర్.  అబద్దాలు చెప్పి ఓట్లు పొందుదామనుకుంటున్నారు. బీజేపీ సిలిండర్ ధర వేయి రూపాలు చేసింది. ధర తగ్గిస్తామని ఇంతుకు ముందు మీ బీజేపీ పార్టీ చెప్పింది. వేయి 40 రూపాయలు పెంచారు రాజేందర్. కేంద్ర మంత్రులతో చెప్పించి సిలిండర్ ధర తగ్గించమని అడుగు. ధరలు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ'' అని మండిపడ్డారు. 

''కేసీఆర్ ఎకరానికి ఐదు వేలు కుడి  చేయితో ఇస్తే... ఎడమ చెత్తో డీజిల్ ధరలు పెంచి రైతు వద్ద నుండి డబ్బులు గుంజుకుంటున్న పార్టీ బీజేపీ. రైతు మెడకు ఉరితాడు  పడ్డా సరే నేను మాత్ర బాగుండాలి. నేను మాత్రం గెలవాలి అంటున్నడు రాజేందర్. కారు గుర్తు రెండవ సీరియల్ నెంబర్.  30 వ తేదీన దానిపై ఓటు గుద్దండి'' అని మంత్రి హరీష్ కోరారు. 

click me!