హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి చేరడం దాదాపు ఖరారయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, సహ ఇంచార్జ్ రోహిత్ చౌదరి ఈ మేరకు ధ్రువీకరించారు. బిజెపిలో ముఖ్య నేతలైన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని వీరు తెలిపారు.
శుక్రవారం ఢిల్లీలో మాణిక్ రావు ఠాక్రే, రోహిత్ చౌదరి ఇద్దరూ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వెళ్లిన నేతలు.. అక్కడ ఉండలేక పోతున్నారని తెలిపారు. తిరిగి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనితోపాటు త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి కూడా కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు.
ఈ చేరికల తర్వాత టిఆర్ఎస్, బిజెపిల నుంచి కాంగ్రెస్లోకి నేతలు పెద్ద ఎత్తున చేరుతారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగిపోయాయన్నారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయం ఎలా సొంతమవుతుందో తెలియడంతో, ఆ మేరకు ముందుకు పోతున్నారని తెలిపారు,
కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ మార్పును గమనించిన ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతాయని చెప్పారు. ఇక, తెలంగాణలో సొంత పార్టీ పెట్టి ఉనికిని చాటుకున్న వైఎస్సార్సీపీ అధినేత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం మీద మాట్లాడుతూ…ఈ అంశం అధిష్టానం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.
అధిష్టానం షర్మిలతో మాట్లాడుతుందని.. అయితే, ఆమె వల్ల తెలంగాణలో కాకుండా ఏపీలో తమకు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషించారు.రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పారు. తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటనల మీద త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు,
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఒక సీటు వచ్చినా కూడా తాను రాజకీయాలను వదిలేస్తానని ట్రాక్టర్ చేశారు. మహారాష్ట్రలో గెలవడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం లేదని తెలిపారు. కాంగ్రెస్ బలంగా ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాల్లోనే బిఆర్ఎస్ సభలు నిర్వహిస్తుందని.. దీనివల్ల బీజేపీకి సహకరించడమే బిఆర్ఎస్ ఉద్దేశం అన్నారు.
బిజెపి నేతలతో ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అవ్వడం వెనక అంతరాయం ఏంటి అని ప్రశ్నించారు. విపక్ష పార్టీ నేతలు కేంద్రం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాల మీద సమావేశం అయిన సమయంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీ ముఖ్యనేతలతో సమాచారం అవుతున్నారన్నారు. ఈ భేటీ అవ్వడం వెనగా మతలబేంటి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని.. వారి పొత్తును ఖరారు చేసుకోవడానికే కేటీఆర్ అమిత్ షాను కలిశాడని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని.. అందుకే మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. తెలంగాణకు సంబంధించి పార్టీలో చేరికలు, ఇతర ముఖ్యమైన అంశాల్లో డీకే శివకుమార్ సహకారాన్ని అధిష్టానం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఈ సంప్రదింపులన్నీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నారని ఊహాగానాలు వెలువుడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారంనాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెడుతున్నారు. అయితే, ఆయన వెళ్లడానికి వ్యక్తిగత పనులా? బీజేపీ పెద్దల పిలుపుమేరకు వెళ్లారా? అనేది స్పష్టత లేదు. మరోవైపు ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెల్తున్నారనే ప్రచారం జరుగుతున్నా.. ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదు.