టీ బీజేపీలో కీలక మార్పులు.. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి?...

First Published | Jul 1, 2023, 10:23 AM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర బీజేపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించి, కిషన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు జరగబోతున్నాయి అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో  ఎన్నికలకు ముందే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలోని పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించి ఆ స్థానంలో కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడైన జి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించనున్నారని విశ్వసనీయ సమాచారం.

బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో లేదా పార్టీ జాతీయ నాయకత్వంలో అవకాశం కల్పిస్తారని చర్చ జరుగుతోంది. ఈ మార్పుల మీద మూడు నాలుగు రోజుల్లోనే స్పష్టత వస్తుందని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా  ఆయా రాష్ట్రాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై అగ్రనాయకత్వం గత మూడు నాలుగు రోజులుగా కీలక కసరత్తులు నిర్వహించింది.


దీంట్లో భాగంగానే రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత బి ఎల్ సంతోష్ లు తీవ్రస్థాయిలో చర్చించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బిజెపి నేతల మధ్య ఏర్పడిన విబేధాలు.. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడుగా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడం వంటివి కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడమే సబబుగా వారు భావించినట్లుగా సమాచారం. 

bandi sanjay

ఇదే సమయంలో బండి సంజయ్ నేతృత్వంలో కీలకమైన హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలు..టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.  జిహెచ్ఎంసి లో 48 స్థానాల్లో గెలుపు వంటి అంశాలను పార్టీ స్థానాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. బండి సంజయ్ ని మార్చడం వల్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి అవకాశం లేకుండా చూడాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, లేకపోతే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక బాధ్యతలు అప్పగించడం చేయొచ్చని అంటున్నారు.

ఇక వేరే పార్టీలో నుంచి బిజెపిలోకి వచ్చి చేరిన పలువురు నేతలు అసంతృప్తిగా ఉండడంపై దానిమీద కూడా పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ నుంచి వెళ్లిపోతారన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో వారికి పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కొంతకాలంగా అసంతృప్తిగా ఉండడంతో ఆ వైపుగా కూడా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిసారించింది.

బండి సంజయ్ కు కేంద్ర జాతీయ నాయకత్వంలో అవకాశం కల్పిస్తే.. సంజయ్ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్ లేదా రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ లేదా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ తాజా పరిణామాల మీద రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్,  కేంద్రమంత్రి క్రిషన్ రెడ్డి కలిసి ఇటీవల ప్రకటించారు.

అంతలోనే ఈ కొత్త పరిణామాలు.. హఠాత్తుగా చోటు చేసుకుంటుండడం.. వీటి మీద ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తుండడం వంటి అంశాలు సంజయ్ ను ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన అసంతృప్తిని సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు వేరే వారికి అప్పగిస్తే తాను కార్యకర్తగానే ఉండిపోతానని.. అంటున్నట్లుగా సమాచారం. పార్టీ జాతీయ నాయకత్వం త్వరలోనే రాష్ట్ర ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి పదవుల మార్పు ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తుందని తెలుస్తున్న నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో బిజెపి ముఖ్య నేత బిఎల్ సంతోష్ ఇతర నేతలతో సంజయ్ చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం మాజీ మంత్రి విజయరామారావు చేసిన ఓ ట్వీట్ వీటిని సమర్థించే లాగా ఉంది.. సంజయ్ ను అధ్యక్ష స్థానం నుంచి మారిస్తే బిజెపికి రాష్ట్రంలో ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని..  దీనివల్ల కొత్తగా చేరికలు ఉండకపోగా పార్టీని విడిచి వెళ్లిపోయే వారే ఉంటారు అంటూ ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న బిజెపి.. ఈ క్రమంలోనే ఒకరికి ఒకే పదవి అనే అంశం మీద కూడా ఆలోచిస్తుంది. 

బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం శాసనసభల ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి చోట ప్రోటోకాల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాష్ట్ర అధ్యక్షులకు ఉండకుండా చూడాలని.. కేంద్ర మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇది కుదురుతుందని భావిస్తుంది.

అందుకే ఇప్పటికే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న వారిని అలాగే కొనసాగిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించాలనే దానిమీద ఆలోచన చేస్తున్నారు. అయితే, ఇది ఒకరికి ఒకే పదవి అని దానికి విరుద్ధంగా మారే అవకాశం ఉంది. కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉంటుంది కాబట్టి… దీన్ని కూడా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నట్టుగా సమాచారం.

Latest Videos

click me!