KCR SIT Investigation : ఫోన్ ట్యాపింగ్ సెగ.. 5 గంటల పాటు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం.. ఏం తేల్చారు?

Published : Feb 01, 2026, 11:54 PM IST

KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందినగర్‌లోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగింది.

PREV
15
గులాబీ బాస్ వర్సెస్ సిట్: దాదాపు 5 గంటల విచారణలో అసలేం జరిగింది?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం నందినగర్ ఆదివారం రాజకీయ రణరంగంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ను విచారించేందుకు సిట్ అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్నారు. మాధాపూర్ డీసీపీ రీతిరాజ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం కేసీఆర్‌ను సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రశ్నించింది. ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం గమనార్హం.

25
ఉద్యమ గదిలో విచారణ.. కేసీఆర్ భావోద్వేగం

విచారణ ప్రారంభానికి ముందు కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. ఏ గదిలో కూర్చుని తాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించారో, ఏ ఇంట్లో నుంచి ఉద్యమాన్ని నడిపించారో.. అదే గదిలో నేడు నేరారోపణలపై విచారణ ఎదుర్కోవాల్సి రావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "స్వరాష్ట్రం కోసం నిద్రలేని రాత్రులు గడిపిన చోట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు" అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

35
కేసీఆర్ కు సిట్ సంధించిన అస్త్రాలు : ఆ ప్రశ్నల వెనుక ఆంతర్యం ఇదే

విచారణలో సిట్ అధికారులు కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రశ్నలు సంధించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయమని మీరు నేరుగా ఆదేశాలు ఇచ్చారా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు పదవీ విరమణ తర్వాత కూడా బాధ్యతలు ఎందుకు పొడిగించారు? ఆయన ద్వారానే ట్యాపింగ్ నడిచిందా? మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు మీకు ఎలా దొరికాయి? అది ట్యాపింగ్ ఫలితమేనా? ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ ఫండ్స్ వాడారా? ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్లు ఎందుకు ట్యాప్ అయ్యాయి? ఇలాంటి కొన్ని ప్రశ్నలను వేసినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

45
రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలతో దద్దరిల్లిన తెలంగాణ

కేసీఆర్ విచారణకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, హుజరాబాద్, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. తెలంగాణ చరిత్ర అంటూ కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు.

55
కేసీఆర్ అరెస్టు తప్పదా? రాజకీయాల్లో హాట్ టాపిక్

విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. వెళ్లే ముందు పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సిట్ అధికారులు సేకరించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు తదుపరి చర్యలకు కీలకం కానున్నాయి. ఈ కేసులో మరికొందరు కీలక నేతలకు నోటీసులు అందే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories