Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్‌.. షాకింగ్ నిజాలు !

Published : Jan 30, 2026, 11:02 PM IST

Hyderabad Air Quality : హైదరాబాద్‌లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చెన్నై, బెంగళూరులను మించి అత్యధిక పీఎం-10, సల్ఫర్ డయాక్సైడ్ నమోదుతో భాగ్యనగరం డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ లో బతకడం కష్టమేనా?

PREV
15
హైదరాబాద్ గాలిలో విషం.. దక్షిణాదిలోనే అత్యంత కలుషిత నగరం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దక్షిణాదిలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ అత్యంత కలుషిత నగరంగా మారింది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ (MCR HRD) ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన 'ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అండ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్' సదస్సులో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఈ షాకింగ్ నిజాలను వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే కాలుష్యం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.

25
హైదరాబాద్ లో ప్రమాదకర స్థాయిలో పీఎం-10 నిష్పత్తి

కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం, జనవరి నెలలో హైదరాబాద్ లో పీఎం-10 స్థాయిలు కనిష్ఠంగా 80 మైక్రోగ్రాముల నుంచి గరిష్ఠంగా 105 మైక్రోగ్రాముల వరకు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం, గాలిలో ఘనరూప కణాలు ఒక క్యూబిక్ మీటరుకు 40 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. 

కానీ హైదరాబాద్‌లో ఇది 82 నుంచి 88 మైక్రోగ్రాముల మధ్య ఉంది, అంటే దాదాపు రెట్టింపు అన్నమాట. సిపిసిబి నిబంధనలైన 60 మైక్రోగ్రాములతో పోల్చినా హైదరాబాద్‌లో కాలుష్యం 35 శాతం ఎక్కువగా ఉంది. దురదృష్టవశాత్తు గత ఏడాది కాలంలో నగరంలో ఒక్క రోజు కూడా క్లీన్ ఎయిర్ నమోదవ్వలేదని అధికారులు తెలిపారు.

35
హైదరాబాద్ గాలిలో పెరిగిన సల్ఫర్ డయాక్సైడ్.. ఐఐటి కాన్పూర్ అధ్యయనం

ఐఐటి కాన్పూర్  సహకారంతో పీసీబీ నిర్వహించిన అధ్యయనంలో సల్ఫర్ డయాక్సైడ్ (SO₂) ఉద్గారాలపై కీలక విషయాలు బయటపడ్డాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో రోజుకు 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10,701 కిలోలు నమోదవుతోంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వాహనాల వల్ల 91 శాతం సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంటే, ఓఆర్ఆర్ పరిధిలో పరిశ్రమల వల్ల 92 శాతం కాలుష్యం పుడుతోంది. సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోని తేమతో కలిసినప్పుడు ఆమ్ల వర్షాలకు దారితీస్తుందని, ఇది శ్వాసకోశ వ్యాధులకు, ఊపిరితిత్తుల సమస్యలకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

45
హైదరాబాద్ నగరంలో ఏడు కాలుష్య హాట్‌స్పాట్‌లు

హైదరాబాద్ లో కాలుష్యం అత్యధికంగా ఉన్న ఏడు ప్రధాన ప్రాంతాలను పీసీబీ గుర్తించింది. ఇవన్నీ ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లు కావడం గమనార్హం.

  1. ఖైరతాబాద్ - కోటి
  2. జీడిమెట్ల
  3. బీహెచ్‌ఈఎల్ - అమీర్‌పేట్
  4. నాంపల్లి - చార్మినార్
  5. మెహదీపట్నం - హైటెక్ సిటీ - కూకట్‌పల్లి
  6. సికింద్రాబాద్ - సైనిక్‌పురి
  7. ఎల్బీ నగర్ - కోటి

ఈ ప్రాంతాల్లో వాహన ఉద్గారాలను తగ్గించేందుకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ధూళి నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

55
పరిష్కార మార్గాలు, నిపుణుల సూచనలు ఇవే

పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాల నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉద్గారాల పరిమితి 100-500 mg/Nm³ ఉండగా, ఇతర దేశాల తరహాలో దీనిని 30 mg/Nm³ కంటే తక్కువకు తీసుకురావాలని రిపోర్టు స్పష్టం చేసింది.

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని పెంచాలని, కాలుష్య కారక పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలని ఐఐటి కాన్పూర్ రిపోర్టు సిఫార్సు చేసింది. పెరిగిపోతున్న వాహనాల సంఖ్య, భవన నిర్మాణ కార్యకలాపాలు గాలి నాణ్యతను మరింత దెబ్బతీస్తున్నాయని, ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories