
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలనాలకు కేంద్రంగా మారారు. ఆయన తీసుకొనే నిర్ణయాలు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా మారాయి. అధికార పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తిన చరిత్ర జూపల్లి కృష్ణారావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గళమెత్తాడు జూపల్లి కృష్ణారావు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జూపల్లి కృష్ణారావు గొంతెత్తారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేడు బీఆర్ఎస్ జూపల్లి కృష్ణారావును పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 1999లో జూపల్లి కృష్ణారావు అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్ధిపై జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావుకు టిక్కెట్టు ఇవ్వలేదు . ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కూటమిగా పోటీ చేశాయి. దీంతో కొల్లాపూర్ స్థానాన్ని బీఆర్ఎస్ కు కేటాయించింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బరిలో నిలిచారు. కానీ ఈ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు విజయంసాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరారు.
2009లో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.2009 లో జూపల్లి కృష్ణారావు , డీకే అరుణలకు వైఎస్ఆర్ కేబినెట్ లో చోటు దక్కింది. వైఎస్ఆర్ మరణించిన తర్వాత రోశయ్య కేబినెట్ లో జూపల్లి కృష్ణారావుకు , డీకే అరుణలకు అవకాశం దక్కింది. అయితే జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గ పునర్వవ్యవస్తీకరణలో మంచి శాఖ దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారని అప్పట్లో ఆయన అనుచరవర్గంలో ప్రచారం సాగింది
అదే సమయంలో తెలంగాణ ఉద్యమానికి జూపల్లి కృష్ణారావు సై అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేశారు . ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. జూపల్లి కృష్ణారావు పాదయాత్ర గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించే సమయంలో జూపల్లి కృష్ణారావును పోలీసులు అరెస్ట్ చేశారు. జూపల్లి కృష్ణారావు అరెస్ట్ అప్పట్లో రాజకీయంగా కలకలం రేపింది.
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ లో చేరారు. 2012 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు విజయంసాధించారు. 2014 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. పౌరసరఫరాల శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పనిచేశారు.
2018 ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యాడు. హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది.
హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య పొసగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన వర్గం అభ్యర్ధులను పోటీలో నిలిపి గెలిపించుకున్నారు. గత ఏడాది కొల్లాపూర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ జూపల్లి కృష్ణారావుతో చర్చించారు ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్దిపై బహిరంగ చర్చ విషయంలో జూపల్లి కృష్ణారావు , హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య బహిరంగ సవాళ్లు చోటు చేసుకున్నాయి.
కొంతకాలంగా జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది. గత ఏడాది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. నిన్న కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. దీంతో జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బీఆర్ఎస్ నాయకత్వం వేటేసింది.