IMD Rain Alert: హమ్మయ్యా.. ఇక ఊపిరి పీల్చుకోండి.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు

Published : Jul 17, 2026, 05:43 PM IST

IMD Rain Alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వర్షాల కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చిన నాటి నుంచి గ‌ట్టి వాన కురిసింది లేదు. అయితే తాజాగా వాతావ‌ర‌ణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

PREV
16
కూల్ న్యూస్

తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

26
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణపై ప్రభావం

ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వైపు తేమగాలుల ప్రవాహం పెరుగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

36
ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం?

హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో కూడా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని, నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

46
22వ తేదీ వరకు వర్షాలు..

ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా జల్లులు పడే అవకాశమున్నప్పటికీ, విస్తృత స్థాయిలో భారీ వర్షాలు కురిసే సూచనలు మాత్రం కనిపించడం లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం కొంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది.

56
గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం.. ఎండల నుంచి ఉపశమనం

గత 24 గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు, నిన్న పగటిపూట నిజామాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పటికీ, సాయంత్రానికి వర్షాల ప్రభావంతో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉక్కపోత తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.

66
రైతుల్లో కొత్త ఆశలు.. ఖరీఫ్ సాగుకు ఊతమిస్తాయా?

వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ తాజా అంచనా ఆశలు కలిగిస్తోంది. ఇప్పటికే వర్షాల లేమితో ఖరీఫ్ సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. నేలలో తేమ తగ్గిపోవడంతో విత్తనాలు వేయడంపై రైతులు డైలమాలో ఉన్నారు. ఇప్పుడు కురిసే జల్లులు భూమిలో తేమను పెంచడంతో పాటు పంటల సాగుకు అనుకూల పరిస్థితులు తీసుకురావచ్చని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. భారీ వర్షాలు లేకపోయినా, ఈ మోస్తరు జల్లులు ఎండల తీవ్రతను తగ్గించడమే కాకుండా రైతులకు, సాధారణ ప్రజలకు కూడా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories