హైదరాబాద్ లో మరో తీగల వంతెన ... ఆ ప్రాంతం ఇక టూరిస్ట్ స్పాట్ కానుందా?

First Published | Jan 6, 2025, 8:57 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరనుంది. నగరంలో ఇప్పటికే ఓ కేబుల్ బ్రిడ్జి వుండగా మరోటి నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. ఇది ఎక్కడ నిర్మించనున్నారో తెలుసా? 

Hyderabad Cable Bridge

Hyderabad Cabble Bridge : తెలంగాణ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది హైదరాబాద్ మహానగరం. మరి హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మినార్, ఆ తర్వాత హైటెక్ సిటీ, ఇటీవల కాలంలో కేబుల్ బ్రిడ్జి గుర్తుకు వస్తున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హైటెక్ సిటీ ప్రాంతంలోని దుర్గం చెరువుపై తీగల వంతెన నిర్మించింది. నీటిపై తేలియాడుతూ రంగురంగుల మెరిసే తీగలతో కూడిన ఈ బ్రిడ్జి పర్యాటక ఆకర్షణగా మారింది. క్రమక్రమంగా పర్యాటకుల మనసులు దోచుకుని నగరంలోని టూరిస్ట్ స్పాట్స్ లో చేరిపోయింది ఈ కేబుల్ బ్రిడ్జి. 

అయితే ఈ కేబుల్ బ్రిడ్జి మాదిరిగానే మరో బ్రిడ్జి నిర్మించేందుకు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సిద్దమయ్యింది. అయితే కేసీఆర్ సర్కార్ హైటెక్ సిటీలో నిర్మిస్తే రేవంత్ సర్కార్ ఓల్డ్ సిటిలో కేబుల్ బ్రిడ్జి నిర్మించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ లో రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు జరిగిపోయాయి... ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దీనిపై ప్రకటన చేసారు. 

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఆరాంఘర్-జూపార్క్ ప్లైఓవర్ నిర్మించారు. దీన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓల్డ్ సిటీ అభివృద్దిపై సీఎం కీలక ప్రకటనలు చేసారు. ఇందులో భాగంగానే నెహ్రూ జూపార్క్ కు ఆనుకుని వున్న మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
 

Hyderabad Cable Bridge

హైదరాబాద్ లో రెండో కేబుల్ బ్రిడ్జి : 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు మరో మణిహారంగా నిలిచే రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్దంచేసింది రేవంత్ సర్కార్. రాజేంద్రనగర్ ప్రాంతంలోని మీరాలం చెరువుపై బెంగళూరు జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ దీన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.363 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు కూడా లభించాయి.  

మీరాలం చెరువుపై 2.65 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్ల కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికేే భూసేకరణ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ లో మరో టూరిస్ట్ స్పాట్ కానుంది. 

ఓల్డ్ సిటీ అభివృద్దిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మూసీ సుందరీకరణకు సిద్దమైంది ప్రభుత్వం. మూసి పరివాహక ప్రాంత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ నది సుందరీకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. ఇప్పటికే మూసీ చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. 

ఇలా ఓల్డ్ సిటీ ప్రాంతంలోని మూసీని సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా మార్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇప్పుడు మీరాలం చెరువుపై తీగల వంతెన నిర్మాణానికి సిద్దమయ్యారు. ఇలా కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ ఓల్డ్ సిటీని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు సంసిద్దం అయ్యింది. 


Hyderabad Cable Bridge

ఆరాంఘర్ ప్లైఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు : 

ఇటీవల మృతిచెందిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం తాజాగా హైదరాబాద్ లో ప్రారంభించిన ఆరాంఘర్ ప్లైఓవర్ కు ఆయన పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ప్లైఓవర్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు సీఎం. తెలంగాణ రాష్ట్రం మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్నప్పుడే వచ్చింది... కాబట్టి ఆయనకు ఈ రాష్ట్రంలో తగిన గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వ భావిస్తోంది. 

ఓల్డ్ సిటీ యే ఒరిజినల్ సిటీ... ఇదే అసలు హైదరాబాద్ అనిరేవంత్ పేర్కొన్నారు. ఒకప్పుడు వెలుగొందిన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్దికి దూరంగా వుందని... కాబట్టి దీనిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందుకోసమే మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని అన్నారు. నగర  అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా మేం సిద్దమే...  ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామని రేవంత్ ప్రకటించారు. 

అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది… పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదేనని సీఎం రేవంత్ అన్నారు. త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు వెళుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు...పాలన సమయంలో కాదన్నారు. నగర అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. 

Latest Videos

click me!