
Hyderabad Public School : ప్రపంచానికి సిఈవోలను అందిస్తున్న దేశంగా భారత్ మారుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను భారత సంతతికి చెందినవారు నడిపిస్తున్నారు... ఇప్పుడు మరొకరు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే అమెరికన్ కంపెనీ P&G (ప్రాంక్టర్ & గాంబుల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా శైలేష్ జెజురీకర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ Procter & Gamble చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా ఉన్న ఆయన వచ్చే ఏడాది ఆరంభంలో అంటే జనవర్ 1, 2026 లో సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇప్పటికే భారత సంతతికి చెందిన సత్యనాదెళ్ల మైక్రోసాప్ట్, సుందర్ పిచాయ్ గూగుల్ (ఆల్ఫా బెట్), శంతను నారాయణ్ అడోబ్, అరవింద కృష్ణ ఐబీఎం కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. వీరంతా అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతీయులు గర్వపడేస్థాయిలో ఉన్నారు. ఇప్పుడు శైలేష్ జుజురీకర్ P&B సీఈవోగా ఎంపికవడంతో భారత్ ప్రపంచానికి సీఈవోలను అందిస్తున్న దేశంగా గుర్తింపుపొందింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే శైలేష్ పుట్టింది ముంబైలో అయినా హైదరాబాద్ తో ఆయనకు ప్రత్యేక అనుబంధం కలిగివున్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే కొనసాగింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల చదివిన స్కూల్లోనే శైలేష్ కూడా చదివారు. కేవలం ఈ ఇద్దరే కాదు మరికొన్ని అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు కూడా ఈ స్కూల్లో చదివినవారే. ఇక ఎందరో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా ఈ స్కూల్లో చదివారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ స్కూల్ ఇంకేదో కాదు... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.
ప్రాక్టర్ & గాంబులర్ సీఈవోగా ఎంపికైన శైలేష్ జెజురీకర్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుత మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు... వీరిద్దరూ క్లాస్ మేట్స్ కూడా. ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్నేహితులు ఇప్పుడు టాప్ అమెరికన్ కంపెనీలకు సిఈవో లు అయ్యారు.
ఇక వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా కూడా ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు. ఈయన గతంలో మాస్టర్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. అలాగే అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కూడా ఈ స్కూల్ విద్యార్థే. ఇలా ఒకే స్కూల్లో చదివిన నలుగురు అంతర్జాతీయ కంపెనీలను నడిపించే స్థాయికి చేరుకున్నారు.
నిజాంల కాలంలో ప్రారంభమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కేవలం అంతర్జాతీయ స్థాయి ఉద్యోగులనే కాదు ఎందరో నాయకులను కూడా అందించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ స్కూల్లోనే చదువుకున్నారు. స్కూల్ డేస్ లో మంచి క్రికెటర్ అయిన ఆయన చివరకు రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసారు.
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇతడి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసారు... దీంతో వీరి కుటుంబం హైదరాబాద్ లో ఉండేవారు. దీంతో వైఎస్ జగన్ ప్రాథమిక విద్యాబ్యాసం హెచ్పిఎస్ లో సాగింది. తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఐదేళ్లపాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
తెెలంగాణను పాలించిన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ లో మంచి విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని స్వాతంత్య్రానికి పూర్వమే భావించారు. ఈయన ఆలోచనకు బ్రిటిష్ అధికారుల సలహాలు, సూచనలు కూడా తోడయ్యాయి. దీంతో 1923 లో బేగంపేటలో ఓ స్కూల్ ను ఏర్పాటుచేశారు... ఇదే ఇప్పుడున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.
ఆరంభంలో ఈ స్కూల్ కేవలం ఐదుగురు విద్యార్థులు, ఆరుగురు టీచర్స్ తో ప్రారంభమైంది. అనంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే బెస్ట్ స్కూల్స్ జాబితాలో చేరిపోయింది. ఈ స్కూల్లో చదివిన ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇలా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ స్కూల్ ఇప్పటికి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోంగ్లే, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి కూడా ఈ స్కూల్లో చదివినవారే. ప్రిస్మా క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకులు గిరీష్ రెడ్డి, ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్ సీఈవో ప్రేమ్ వత్స కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే. ఇంకా సినీ హీరోలు నాగార్జున, రానా కూడా ఇక్కడే చదివారు. ఇలా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్నతస్థాయికి చేరుకున్నవారిని ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అందించింది.