హైదరాబాద్ లో ఇవాళ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనే నగరవాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెబుతోంది. అదేంటో తెలుసా?
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. గల్లీగల్లీలో ప్రతిష్టించిన గణనాథులు నేడు(శనివారం) గంగమ్మతల్లి ఓడికి చేరనున్నారు... ఇన్నిరోజులు భక్తిశ్రద్దలతో పూజలుచేసిన స్వామిని భారీ ఊరేగింపుతో తరలించనున్నారు. అయితే వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి... స్వామి విగ్రహాలతో నిండిన భారీ వాహనాలతోనే రోడ్లు నిండిపోతాయి. దీంతో ఈ నిమజ్జన వేడుకల కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇది గుర్తించిన హైదరాబాద్ మెట్రో అధికారులు నిమజ్జనం వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు... కాబట్టి నగరవాసులు ఇక కంగారుపడాల్సిన అవసరం లేదు.
25
అర్ధరాత్రి వరకు నిమజ్జన వేడుకలను ఎంజాయ్ చేయండి..
హైదరాబాద్ లో హుస్సెన్ సాగర్ తో పాటు పలు చెరువుల వద్ద వినాయక నిమజ్జన వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపుగా వచ్చే వివిధ రూపాల గణనాథులను చూడ్డానికి రెండుకళ్లు సరిపోవు. అయితే రాత్రి విద్యుద్దీపాల వెలుగులో ఆ బొజ్జ గణపయ్య మరింత సుందరంగా కనిపిస్తారు... ఆ సమయంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే నగరప్రజలు సాయంత్రం సమయంలోనే నిమజ్జన ప్రాంతాలకు తరలివెళుతుంటారు. ఇలా నగరవాసుల సౌకర్యార్థం మెట్రో ప్రత్యేకంగా అర్ధరాత్రి వరకు రైళ్లను నడపున్నట్లు ప్రకటించింది.
35
నేడు హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ ఇవే..
ఈరోజు (శనివారం) వినాయక నిమజ్జనం నేపథ్యంలో మెట్రో సమయాల్లో మార్పులు ఉంటాయని హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 6న ఉదయం 6AM కే మెట్రో ప్రయాణం ప్రారంభం అవుతుందని... ఇది అర్ధరాత్రి వరకు అంటే సెప్టెంబర్ 7న 1AM వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రకటించారు. అంటే ఉదయం ఖైరతాబాద్ వినాయక శోభాయాత్రలో పాల్గొనాలని అనుకునేవారు... రాత్రి హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో నిమజ్జన వేడుకలు చూడాలనుకునే భక్తులకు అనుకూలంగా ఈ సమయాలను అడ్జెస్ట్ చేసింది మెట్రో.
ఇదిలాఉంటే ఇవాళ(శనివారం) వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి... రేపు(ఆదివారం) ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక హుస్సేన్ సాగర్ పరిసరప్రాంతాల్లో ఆంక్షలు ఆదివారం మొత్తం కొనసాగే అవకాశాలుంటాయి. జిల్లాల నుండి నగరానికి వచ్చే ఆర్టిసి బస్సులను శివారుల్లోనే నిలిపివేయనున్నారు... కూకట్ పల్లి, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, మెహదీపట్నం వంటి ప్రాంతాలవరకే ఈ బస్సులు నడవనున్నాయి. అలాగే లారీలు వంటి భారీ వాహనాలకు కూడా నగరంలోకి ఎంట్రీ ఉండదు... కేవలం ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే అనుమతిస్తారు.
55
హైదరాబాద్ లో పోలీస్ బందోబస్తు
హైదరాబాద్ లో వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లోనే కాదు రద్దీ ఎక్కువగా ఉండేచోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే ఆంక్షలు అమలుచేశారు. ప్రశాంతంగా ఈ నిమజ్జన వేడుకలు జరిగేలా తెలంగాణలోని పోలీసులనే కాదు ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసరప్రాంతాల్లో అత్యధికంగా పోలీసులకు మొహరించారు.