Hyderabad : ఏమిటీ..! ఐదేళ్ల వయసులో మింగిన పెన్ క్యాప్ ను 26 ఏళ్లకు తీసారా..!!

Published : Feb 19, 2025, 09:44 PM ISTUpdated : Feb 19, 2025, 09:48 PM IST

 హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులకు అరుదైన కేసు ఎదురయ్యింది. ఓ యువకుడి శరీరంలో దాదాపు 21 ఏళ్ళుగా ఓ పెన్ క్యాప్ ఉంది... ఐదేళ్ల వయసులో మింగినదాన్ని 26 ఏళ్ల వయసులో గుర్తించారు. మరి ఆ యువకుడికి ఎలాంటి వైద్యం చేసారో తెలుసా? 

PREV
13
Hyderabad : ఏమిటీ..! ఐదేళ్ల వయసులో మింగిన పెన్ క్యాప్ ను 26 ఏళ్లకు తీసారా..!!
Hyderabad

Hyderabad : చిన్నతనంలో మింగిన పెన్ క్యాప్ 20 ఏళ్లకుపైగా అతడి శరీరంలోనే ఉంది. ఐదేళ్ల వయసులో అతడి శరీరంలోకి వెళ్లిన పెన్ క్యాప్ 26 ఏళ్ల వయసులో బయటకు వచ్చింది. ఇలా ఓ యువకుడి శరీరంలో రెండుదశాబ్దాలకు పైగా ఉన్న వస్తువున్న హైదరాబాద్ వైద్యులు బయటకు తీసారు. 

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ యువకుడు ఇటీవల తీవ్ర దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే రోజురోజుకు బరువు తగ్గుతుండటం, నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించారు. స్థానిక డాక్టర్లు సిటీ స్కాన్ తీయించి ఇన్ఫెక్షన్ గా నిర్దారించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాలని సూచించారు. 

యువకుడిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చిన కుటుంబసభ్యులు కొండాపూర్ కిమ్స్ కు వెళ్ళారు. ఇక్కడ సిటీ స్కాన్ తీయగా ఊపిరితిత్తుల్లో ఏదో కణితి లాగా కనిపించింది. మరింత పరిశీలించగా అది ఓ పెన్ క్యాప్ గా తేలింది. చిన్నప్పుడు అనుకోకుండా మింగిన పెన్ క్యాప్ ఇప్పుడు అనారోగ్యానికి కారణంగా గుర్తించారు.  వెంటనే సర్జరీ చేసి ఊపిరితిత్తుల్లోని ఆ పెన్ క్యాప్ ను తొలగించి యువకుడిని కాపాడారు కిమ్స్ వైద్యులు. 
 

23
Hyderabad

యువకుడి బాడీలోకి పెన్ క్యాప్ ఎలా చేరింది... 
 
హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదెళ్ళ యువకుడి శరీరంలో పెన్ క్యాప్ ఎలా చేరిందో వివరించారు. యువకుడి అనారోగ్య సమస్య గురించి తెలుసుకుని అందుకు కారణమేంటో తెలుసుకునేందుకు సిటీ స్కాన్ చేసామని తెలిపారు. ఇందులో ఊపిరితిత్తుల్లో ఏదో గడ్డలాగా కనిపించిందని... దానివల్లే దగ్గు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించామని డాక్టర్ తెలిపారు. 

యువకుడి కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పి వైద్యం ప్రారంభించామని డాక్టర్ శుభకర్ తెలిపారు. అయితే ఈ గడ్డలాంటి పదార్థాన్ని తొలగించే ప్రయత్నంలో అదో పెన్ క్యాప్ గా గుర్తించామన్నారు. వెంటనే యువకుడి సోదరుడిని పిలిచి అడగగా చిన్నతనంలో పెన్ క్యాప్ మింగాడని చెప్పాడు... అప్పుడే స్ధానికంగా ఓ డాక్టర్ ను సంప్రదించగా కడుపులో ఏమీలేదని... బహుశా మలంతో పాటు బయటకు వెళ్లివుంటుందని చెప్పాడని తెలిపాడు. దీంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసామని యువకుడి సోదరుడు తెలిపాడు. 

ఇలా ఐదేళ్ల కింద మింగిన పెన్ క్యాప్ 26 ఏళ్ల తర్వాత బైటపడటంతో డాక్టర్లే ఆశ్చర్యపోయారు. వెంటనే యువకుడి శరీరంలోంచి దాన్ని తీసేందుకు ఏర్పాట్లు చేసారు.  సక్సెస్ ఫుల్ గా సెంటిమీటర్ పొడవున్న పెన్ క్యాప్ ను బయటకు తీసి యువకుడిని కాపాడారు. 
 

33
Hyderabad

21 ఏళ్లుగా శరీరంలో ఉన్న పెన్ క్యాప్ ను ఎలా తీసారంటే... 

యువకుడి శరీరంలో దాదాపు 21 ఏళ్లుగా ఆ పెన్ క్యాప్ ఉంది. కాబట్టి దీన్ని తీసేందుకు మూడు గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డాల్సి వచ్చిందని డాక్టర్ శుభకర్ తెలిపారు. ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ సాయంతో ముందుగా దాని చుట్టూ పేరుకుపోయిన క‌ణ‌జాలాలు, లింఫ్‌నోడ్, కండ‌ల‌ను కొద్దికొద్దిగా తొల‌గించామని తెలిపారు. ఇలా పెన్ క్యాప్ చుట్టూ క్లియర్ చేసాక  మెళ్ళిగా దాన్ని బయటకు తీసామని తెలిపారు.

ఇంతకాలం బయట వస్తువు శరీరంలో ఉండిపోవడంతో ఊపిరితిత్తులు కొంత దెబ్బతిన్నాయని డాక్టర్ శుభకర్ తెలిపారు. కాబట్టి యువకుడు కోలుకోడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. దెబ్బతిన్న భాగాలను సరిచేసేందుకు మందులు వాడుతున్నామని డాక్టర్ తెలిపారు. 

పిల్లలు ఏదయినా వస్తువులు మింగితే అలాగే వదిలేయకూడదని... అప్పటికప్పుడు వాటివల్ల ప్రమాదం లేకున్న ఇలా భవిష్యత్ లో ప్రాణాంతకంగా మారతాయని డాక్టర్ శుభకర్ హెచ్చరించారు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వహించివుంటే యువకుడి ఊపిరితిత్తులు మొత్తం పాడయిపోయేవని అన్నారు. ఇంకొంతకాలం ఆగివుంటే దెబ్బతిన్న భాగాలను తొలగించాల్సి వచ్చేదన్నారు. అదృష్ట‌వ‌శాత్తు ముందే గుర్తించ‌డంతో మందుల‌తోనే దాన్ని స‌రిచేయ‌గ‌లిగామన్నారు.

కాబట్టి చిన్నపిల్ల‌లు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాళ్లు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని... నోట్లో ఏం పెట్టుకోకుండా చూడాలని సూచించారు. అనుకోకుండా ఏవయినా మింగితే వెంటనే వైద్యులవద్దకు తీసుకెళ్లాలని... ఏం కాదులే అనుకుంటే ఇలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని డాక్టర్ శుభకర్ నాదెళ్ల తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories