తగ్గిన తెలంగాణ ఆర్టిసి టికెట్ ధరలు :
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే నగరంలో తెలంగాణ ప్రజలకంటే ఎక్కువగా ఏపీ ప్రజలే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం నగరానికి వచ్చినవారు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇక్కడే స్థిరపడిపోయారు. నగరంలో కూకట్ పల్లి,కెపిహెచ్బి, మియాపూర్, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఏపీ ప్రజలే ఎక్కువగా కనిపిస్తారు.
ఇలా హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో నివాసముండే ఏపీ ప్రజలకు టిజిఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య నడిచే తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో టికెట్ ధరలు తగ్గిస్తూ టిజిఎస్ ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న టికెట్ రేట్లను దాదాపు 10 శాతం తగ్గించనున్నట్లు టిజిఎస్ ఆర్టిసి ఎండి ప్రకటించారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య టిజిఎస్ ఆర్టిసి నడిపే లహరి నాన్ ఏసి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఇప్పుడున్న టికెట్ ధరలను 10 శాతం తగ్గించారు. అలాగే రాజధాని ఏసి బస్సుల్లో టికెట్ ధరపై 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అంటే ఈ బస్సుల్లో విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణాలు సాగించేవారికి ఇకపై కాస్త ఖర్చు తగ్గుతుందన్నమాట.