Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు షాక్... ఈటల సమక్షంలో బిజెపిలోకి జమ్మింకుట మాజీ మండలాధ్యక్షుడు

First Published Oct 1, 2021, 3:37 PM IST

హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన రోజే అధికార టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ జమ్మికుంట మండలాధ్యక్షుడు మాజీ మంత్రి ఈటల సమక్షంలో బిజెపిలో చేరాడు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలై ఇవాళ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ నాయకులు ఈటల రాజేందర్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇవాళ(శుక్రవారం) జమ్మికుంట పట్టణంలో పర్యటించిన ఈటల సమక్షంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరారు. జమ్మికుంట మండలం టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పొలసాని సంపత్ తో పాటు మండలస్థాయి నాయకుడు ఆకుల రమేష్ తో మరికొందరికి కాషాయ కండువా కప్పి బిజెపిలో చేర్చుకున్నారు ఈటల.   

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తనది రోశంగల్ల పుట్టుక అని అన్నారు. అలాంటిది తాను మళ్లీ కాళ్ళు మెక్కుతా బాంచన్ అని సీఎంకి లేఖ రాస్తానా? అన్నారు. ఇప్పుడు మళ్లీ తాను దళితబంధు వద్దు అని లేఖ రాసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. అయితే ఎన్నికల కమీషన్ మాత్రం తమకు ఎలాంటి లేఖ రాలేదు అని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అయినా ఇంకో ఫేక్ పోస్ట్ సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. మీరంతా ఫేక్ గాళ్లు అంటూ టీఆర్ఎస్ నాయకులపై ఈటల మండిపడ్డారు. 

''సీఎం కేసీఆర్ కు మానవత్వమే కాదు నీతిచ జాతి కూడా లేదు. నువ్వు ధర్మంతో గొక్కున్నావు... మూల్యం చెల్లించించుకోక తప్పదు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి మహామహులే ఓడిపోయారు... ఎవరు శాశ్వతం కాదు కేసిఆర్. మీకు ఓటమి తప్పదు'' అని ఈటల హెచ్చరించారు. 

''నా చిరకాల ఉద్యమ సహచరుడు సంపత్ రావు బీజేపీలో చేరడంతో చాలా సంతోషంగా వుంది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బిజెపిలో ఆయనకు మంచి అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నా. అందుకోసం నా వంతు సహకారం అందిస్తా'' అని ఈటల అన్నారు. 

''నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడినంట... అది ఎలాగో చెప్పు మిత్రమా హరీష్. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చనే అన్నట్టు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాపై నేనే దాడి చేయించుకుని సానుభూతి కోసం కట్టుకట్టుకొని వస్తానని చెప్తున్నారు. అలా చేసేది మీరు'' అని టీఆర్ఎస్ నాయకులకు కౌంటరిచ్చారు. 

''ఆస్తులు ఎవ్వరికీ పుకట్ కి రావు. ఇప్పటికి కూడా నా భార్య, కొడుకు కోడలు సద్ది కట్టుకొని వ్యాపార పనులు చూసుకోడానికి వెళతారు. అలాంటిది నేను అక్రమంగా ఆస్తులు సంపాదించానని తప్పుడు ప్రచారం చేస్తారా... అలా సంపాదించింది మీరు'' అని ఈటల ఆరోపించారు.  
 

''మావాళ్ళ షాపులు బంద్ పెట్టించి వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. ఏ పథకం కావాలన్నా ఇంటిమీద టీఆర్ఎస్ పార్టీ జెండా ఉండాలట. రాష్ట్రం, ప్రభుత్వం ఏమయినా తన జాగీర్ అనుకుంటున్నాడా కేసిఆర్? ఇవన్నీ మా డబ్బులు. తాగిపడేసే సీసాలు మీద సంవత్సరానికి రూ.30 వేల కోట్ల డబ్బులు వస్తున్నాయి. పెన్షన్లు మీద పెట్టే ఖర్చు రూ.9 వేల కోట్లు మాత్రమేనని" అని పేర్కొన్నారు.

''ఇక్కడికి వస్తున్న ఆరూరి రమేష్ ని అడగండి... నీ నియోజకవర్గంలో దళితబంధు ఇస్తున్నారా... రాత్రికి రాత్రి రోడ్లు పోస్తున్నారా? అని. గత ఎన్నికలో నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచింది నిజమే అయితే మరి స్వయంగా ఆయన కూతురు కవిత ఎందుకు ఓడి పోయింది?'' అని ఈటల అడిగారు. 

'''నా రాజీనామాతో ఇన్ని వచ్చాయి. ఇంకా చాలా వస్తాయి. నేను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుంది. టీఆర్ఎస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి...ప్రమాణాలు చేయకండి. కానీ ఓటు మాత్రం బిజెపికి వేయండి. మోకాళ్ళ మీద, మోచేతుల మీద నడిచినా హుజురాబాద్ ప్రజలు మీకు ఓట్లు వెయ్యరు కేసిఆర్.  2023 లో గోల్కొండ కోట మీద ఎగిరేది కాషాయం జెండా'' అని ఈటల అన్నారు. 
 


''మా వాళ్ళమీద ఈగవాలితే చిచ్చర పిడుగులు అవుతారు. వీళ్ళ పరుగు 30 వ తేదీ వరకే... ఆపై మీ పప్పులు ఉడకవు. మీకు ఎవరు భయపడరు. హుజురాబాద్ లో నా గెలుపు ఖాయం'' అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. 
 

click me!