HMPV Virus
HMPV Virus : మన పొరుగుదేశం చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే చైనా నుండి యావత్ ప్రపంచానికి పాకిన కోవిడ్-19 వైరస్ ఎంతటి మారణహోమం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి బారినపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు... చాలా కుటుంబాలకు కుటుంబాలనే కోల్పోయారు.
ఇక ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్, ఇతర నిబంధనల కారణంగా ఆర్థికంగా చితికిపోయినవారు చాలామంది... చివరకు ఈ కరోనా కారణంగా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీనే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలయ్యింది. ఈ చేధు జ్ఞాపకాల నుండి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న భారతీయులను చైనాలో కొత్తవైరస్ వ్యాప్తి వార్తలు కంగారు పెడుతున్నాయి.
అయితే తాజాగా చైనాలో HMPV (హ్యూమన్ మెటాప్నిమో వైరస్) వ్యాప్తిపై భారత ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్) ఈ వైరస్ గురించి వివరాలను వెల్లడించింది. అలాగే చైనా ప్రభుత్వం కూడా తమ దేశంలో ఈ HMPV వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
HMPV Virus
HMPV వైరస్ పై భారత ప్రభుత్వం ఏమంటోంది :
చైనాలో HMPV వైరస్ వ్యాప్తి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డిజిహెచ్ఎస్ ఉన్నతాధికారి అతుల్ గోయల్ తెలిపారు. ఇది చాలా సాధారణమైన వైరస్ అని... ప్రాణాంతకం ఏమీ కాదని అన్నారు. ఈ వైరస్ వల్ల కేవలం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని... ఇదికూడా చిన్నారులు, వృద్దుల్లోనే ఎక్కువని వెల్లడించారు.
మంచి ఆరోగ్యవంతులు ఈ వైరస్ బారినపడ్డా సాధారణంగా శీతాకాలంలో వచ్చే జలుబు లక్షణాలే వుంటాయని తెలిపారు. వైరస్ కారణంగా కాస్త అనారోగ్యానికి గురయినా నాలుగైదు రోజుల్లో తిరిగి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని అన్నారు. కానీ చిన్నారులు, వృద్దుల్లో ఈ వైరస్ వల్ల ప్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని ... వీరు మాత్రం కాస్త జాగ్రత్తగా వుండాలని డాక్టర్ అతుల్ సూచించారు.
ఇప్పటకే చైనాలో HMPV వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంల డిజిహెచ్ఎస్ అప్రమత్తమైందని... దేశంలో శ్వాస సంబంధిత సమస్యలపై డాటా సేకరిస్తున్నాట్లు డాక్టర్ అతుల్ తెలిపారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో పెద్దగా మార్పులేమీ లేవని... శీతాకాలం కావడంతో కొద్దిగా శ్వాసకోశ సమస్యలు పెరిగినట్లు తెలిపారు. అయితే వీటికి HMPV వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ అతుల్ వెల్లడించారు.
అయితే చైనాలో హెచ్ఎంపివి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతీయులు జాగ్రత్తగా వుండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు వంటి సమస్యతో బాధపడుతున్నవారు ఇళ్లలోనే వుండి రెస్ట్ తీసుకోవాలని... జనాలు ఎక్కువగా వుండే ప్రాంతాలకు రావద్దని సూచిస్తున్నారు.
ఈ వైరస్ గాలిద్వారా వ్యాపిస్తుంది కాబట్టి బయటకు వచ్చినపుడు దగ్గు, తుమ్ము వస్తే నోటికి అడ్డంగా కర్చిప్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మళ్లీ కరోనా వైరస్ సమయంలో ఉపయోగించినట్లే మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
HMPV Virus
HMPV వైరస్ వ్యాప్తిపై చైనా ఏమంటోంది :
హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తిపై జరుగుతున్న ప్రచారంపై చైనా కూడా స్పందించింది. ఈ వైరస్ బారినపడి చైనాలో చాలామంది హాస్పిటల్ పాలయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెబుతోంది. హాస్పిటల్స్ లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలు నమ్మవద్దని... ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ ఏమీ లేదని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం శీతాకాలంలో విపరీతమైన చలి కారణంగానే కొంతమంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చైనా తెలిపింది. ఇదంతా HMPV వైరస్ గా వల్లే అని ప్రచారం చేస్తున్నారని ...కానీ ఇందులో నిజం లేదన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఏటా ఈ సమయంలో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికంటే ఈసారి చాలా తక్కువ కేసులు వున్నాయని చైనాతెలిపింది.
అయితే HMPV వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చైనా వెల్లడించింది. ఈ వైరస్ నివారణకు మార్గదర్శకాలు జారీ చేసామని తెలిపారు. కాబట్టి విదేశీయులు ఎలాంటి భయం లేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
HMPV Virus
HMPV వైరస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు:
HMPV వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగానే శీతాకాలంలో చలి కారణంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇవే లక్షణలు హెచ్ఎంపివి వైరస్ సోకినవారిలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ వైరస్ సోకినవారిని గుర్తించడం చాలా కష్టం.
జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం వుంటుంది. కానీ ముందునుండి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికే ఇలా జరిగే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ హెచ్ఎంపివి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మంచింది. వెంటనే వైద్య సాయం పొందడంవల్ల ఈ HMPV వైరస్ నుండి తొందరగా బయటపడవచ్చు.
అయితే ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులపై ఈ HMPV ప్రభావం ఎక్కువగా వుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, వృద్దులకు ఈ వైరస్ సోకితే జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. వీరిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం వుంటుందని... కాబట్టి వారికి వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం వుంటుందని అంటున్నారు.
HMPV Virus
HMPV వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
కరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది... గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటిస్తే చాలు...ఈ వైరస్ వ్యాప్తిని ఈజీగా ఆపవచ్చు.
కరోనా సమయంలో ప్రతిఒక్కరు మాస్కులు వాడారు... కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మామూలుకు వచ్చింది. మాస్కులు వాడటం అందరూ మానేసారు. ఈ HMPV బారినపడకుండా వుండాలంటే మళ్లీ ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలి.
జలుబు,దగ్గుతో పాటు పైన పేర్కొన్న HMPV వైరస్ లక్షణాలతో బాధపడేవారు ఇంటికే పరిమితం అవ్వాలి. పూర్తిగా ఆరోగ్యం బాగుపడేవరు రెస్ట్ తీసుకుంటే మంచింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఇలాంటి చర్యలవల్ల HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది.
వైరస్ సోకినవారికి జలుబు, ముక్కుకారడం వంటి లక్షణాలుంటాయి. కాబట్టి వారు తరచూ చేతులను నోటికి అడ్డుపెట్టుకోవడంగానీ, ముక్కు తుడుచుకోవడం గాని చేస్తుంటారు. ఇలాంటివారితో షేక్ హ్యాండ్, హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా కొంచెం దూరం పాటిస్తే మంచిది.
HMPV వైరస్ సోకినవారు ఉపయోగించే వస్తువులను వాడటంద్వారా కూడా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ జలుబు, దగ్గు,జ్వరంతో బాధపడే వ్యక్తులు ఉపయోగించే వస్తువులను తాకకూడదు. వారిటి జాగ్రత్తగా తీసుకుని శుభ్రం చేసాకే తిరిగి ఉపయోగించాలి.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా వుండాలి. అలాగే చిన్నారులు, వృద్దులు కూడా జాగ్రత్త. వీరు అనారోగ్యానికి గురయితే వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం అందించడం ఉత్తమం.ఎందుకంటే HMPV వైరస్ వీరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఇవి కూడా చదవండి
చైనాలో మరో కొత్త వైరస్ విజృంభణ ... ఏమిటీ HMPV, లక్షణాలేంటి?