Mulugu
Allem Appaiah : ప్రభుత్వ ఉద్యోగులంటేనే ప్రజల్లో ఓ అభిప్రాయం వుంది. సర్కారు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని చేయరని... రూల్స్ పేరుతో అమాయక ప్రజలను ఇబ్బంది పెడతారని. పురుషులందు పుణ్య పురుషులు వేరు అన్నట్లు ప్రభుత్వ అధికారులందు కూడా కొందరు సిన్సియర్ అధికారులు వేరు. ఇలాంటి భిన్నమైన ప్రభుత్వ ఉన్నతాధికారే అల్లెం అప్పయ్య.
Appaiah
ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం చూసుంటాం... కానీ ములుగు జిల్లా మెడికల్ ఆండ్ హెల్త్ ఆఫీసర్ అప్పయ్య మాత్రం ప్రజలవద్దకే చెప్పులు అరిగేలా తిరిగుతారు. పేదల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడతారు. వైద్యో నారాయనో హరి అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఈ డాక్టర్ అప్పయ్య.
Appaiah
గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగారు కాబట్టి ఆయనకు అడవిబిడ్డల బాధలు తెలుసు. డాక్టర్ గా ఉన్నతస్థానంలో వున్నా మూలాలు మరిచిపోకుండా తన జాతికి సేవ చేసేందుకు సిద్దమయ్యారు అప్పయ్య. తాజాగా అడవిబిడ్డల కోసం చేసిన సాహసం బయటి ప్రపంచానికి ఆయనను పరిచయం చేసింది. ఆయన ఏం చేసారో తెలిస్తే మీరూ శభాష్ డాక్టర్ సాబ్... అనకుండా వుండలేరు.
Appaiah
అడవిబిడ్డల కోసం అప్పయ్య సాహసం :
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. మరీముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివాసముండే గిరిజన ప్రజలు ఈ వ్యాధుల బారిన ఎక్కువగా పడుతుంటారు. కాబట్టి వర్షాకాలంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది మారుమూల అటవీ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా హైల్త్ క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఇలా ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసారు.
Appaiah
గత మంగళవారం ములుగు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సిబ్బందితో కలిసి పెనుగోలు బయలుదేరారు. కానీ ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేదు... భారీ వర్షాల కారణంగా ఆ గ్రామాన్ని వాగులు వంకలు చుట్టుముట్టాయి. దీంతో వైద్య సిబ్బంది ఇక ఆ గ్రామానికి అసాధ్యమని వెనుదిరిగేందుకు సిద్దమయ్యారు. కానీ వైద్యాధికారి అప్పయ్య మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వెళ్లి గిరిజన బిడ్డలకు వైద్యసాయం అందించాలని నిశ్చయించుకున్నారు.
Appaiah
అనుకున్నదే తడవుగా నడక కొనసాగించారు. ప్రయాణం అసాధ్యమనుకున్న గిరిజన గ్రామానికి ప్రమాదకరమైన వాగులు వంకలు, కొండలు గుట్టలను దాటుకుంటూ వెళ్లారు అప్పయ్య. ఇలా దాదాపు 16 కిలోమీటర్లు నరకప్రాయమైన మార్గంలో ప్రయాణించారు వైద్యాధికారి. ఇలా జోరువానలోనే పెనుగోలుకు చేరుకుంది అప్పయ్య బృందం. రాత్రి ఆ గిరిజన గ్రామంలోనే బస చేసి మర్నాడు గ్రామస్తులకు వైద్యసేవల అందించారు. దోమతెరలు, మందులు అందించి వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు సూచించారు డాక్టర్ అప్పయ్య.
Appaiah
ఇలా ఎవరు ఎలాపోతే తనకెందుకు అనుకోకుండా ప్రాణాలకు తెగించి గిరిజన బిడ్డలకు సేవలందించిన ములుగు డిఎంహెచ్వో అప్పయ్యపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఆయన ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు దాటుకుంటూ వెళుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజల ప్రాణభయాన్ని ఆసరాగా చేసుకొని దోచుకునే డాక్టర్లున్న ఈ కాలంలో ప్రజల కోసం ప్రాణాలకు తెగించిన డాక్టర్ సాబ్...నీకు సలాం అంటూ అప్పయ్యను కొనియాడుతున్నారు నెటిజన్లు.