Revanth Reddy
Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ 2024-25 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూపొందించిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. కొద్దిరోజులుగా ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేసి బడ్జెట్ ను రూపొందించారు. ఈ బడ్జెట్ కు ఇవాళ రేవంత్ కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Bhatti Vikramarka
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్ల రూపాయలను రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు పాలనా పరమైన అంశాలకోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీ ముందుంచారు భట్టి విక్రమార్క.
Revanth Reddy
ఈ బడ్జెట్ లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ భారీ నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా పేర్కొన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటలనే స్పూర్తిగా తీసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగానే 63 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'ఇందిరా మహిళా శక్తి' పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం కింద లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు.
Revanth Reddy
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని... బ్రాండింగ్,మార్కెటింగ్ శిక్షణ ఇస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ఏటా 5వేల గ్రామీణ సంఘాలు లేదా ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఐదేళ్లలో 25 వేల సంస్థలకు ఈ లబ్ది చేకూరుతుందని రేవంత్ సర్కార్ వెల్లడించింది.
Bhatti Vikramarka
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణభీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఎవరైనా సభ్యురాలు చనిపోతే ఆమె పేరిట వున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇలా గరిష్టంగా రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఇలా మహిళల రుణమాఫీ కోసం రూ.50.41 కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
bhatti vikramarka
ఇక మహిళా సహాయక సంఘాలకు కూడా ఈ ఏడాది రూ.20 వేల కోట్లకు తగ్గకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.ఇలా వచ్చే ఐదేళ్లలో లక్షకోట్ల వడ్డీలేని రుణాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తామని తెలిపారు. ఈ నిధులు మైక్రో, స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళలు పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.