పండగలు పబ్బాలేవీ లేవు... అయినా ఈ వారమంతా తెలుగు స్టూడెంట్స్ కి వరుస సెలవులొచ్చే ఛాన్స్, ఎందుకో తెలుసా?

Published : Aug 18, 2025, 02:11 PM ISTUpdated : Aug 18, 2025, 02:28 PM IST

తెలుగు రాష్ట్రాల్లో గతవారం మాదిరిగానే ఈవారం కూడా వరుస సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పండగలు పబ్బాలేవీ లేకున్నా ఈ వారం సెలవులెందుకు వస్తున్నాయో తెలుసా?  

PREV
15
ఈ వారంలోనూ స్కూళ్లకు వరుస సెలవులు

School Holidays : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి... ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల్లో ప్రజలు తడిసిముద్దవుతున్నారు. ఆగస్ట్ ఆరంభంనుండే వర్షాలు మొదలవగా గత వారంరోజులుగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల కారణంగా వర్షాలు జోరందుకున్నాయి. కుండపోత వానల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి... ఈవారం కూడా సెలవులతోనే ప్రారంభమయ్యింది.

భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ (సోమవారం) సెలవు ప్రకటించారు. ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కర్నూల్ వంటి మరికొన్ని జిల్లాల్లో కూడా ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులకు సెలవు ఇచ్చారు. అయితే ఈ వారమంతా (ఆగస్ట్ 18 నుండి 23 వరకు) తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది…. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు మరిన్ని సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.

వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సెలవును పొడిగించనున్నట్లు ఏపీ మంత్రి సంధ్యారాణి తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి అధికారులు, విద్యాశాఖ సిబ్బంది సెలవులపై నిర్ణయం తీసుకుంటారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే కలెక్టర్ సెలవులపై నిర్ణయం తీసుకుంటారు. తాజాగా మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో విద్యాసంస్థలకు మరిన్ని సెలవులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

DID YOU KNOW ?
ఇక్కడే రికార్డ్ వర్షం
గత ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం పరిధిలో అత్యధికంగా 235 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కేవలం 12 గంటల్లోనే ఈ స్థాయిలో భారీ వర్షం కురిసింది.
25
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్

ఈసారి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను ముందుగానే తాకాయి... కానీ వర్షాలు మాత్రం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జూన్ ఆరంభంలో తొలకరి జల్లులు కురవాల్సింది కానీ మే చివర్లోనే వర్షాలు మొదలయ్యాయి. అయితే అసలు వర్షాకాలంలో మేఘాలు ముఖం చాటేశాయి... జూన్ లో అసలు వర్షాల జాడలేకుండాపోయింది. జులైలో చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు కురవలేవు... ఇలా వరుసగా రెండునెలల తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో అన్నదాతలకు కళ్లలో ఆనందాన్ని నింపుతూ ఆగస్ట్ లో భారీ వర్షాలు మొదలయ్యాయి.

ఆగస్ట్ ఆరంభంనుండి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతవారం అయితే కుండపోత వానలు పడ్డాయి. ఈ భారీ వర్షాలకు నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. కొన్నిచోట్ల ఇప్పటికే వరద పరిస్థితి నెలకొంది... లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మరికొన్నిరోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు కంగారు పడుతున్నారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతోందని... ఇది ఆగస్ట్ 19న అంటే రేపు (మంగళవారం) తీరం దాటుతుందని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్-ఒడిషా రాష్ట్రాల మధ్య ఇది తీరం దాటుతుందని... ఈ ప్రభావంతో మరో నాలుగైదురోజులు అతిభారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి భారీ వర్షసూచనలున్న జిల్లాల్లో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి.

35
తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణను ముసురు వదలడంలేదు... కొద్దిరోజులుగా ఆకాశం మేఘాలతో కప్పేసివుంటోంది. ఇవాళ (సోమవారం) కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితే ఉంది... హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వారమంతా ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని... కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.

ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరునాగారం పరిధిలోని మంగపేట ప్రాంతంలో కేవలం మూడు నాలుగు గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందంటేనే ఏ స్థాయిలో వానలు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ కుండపోత వానలు కురిసే అవకాశాలున్నాయట. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇక భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి... ఇలా భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, వరంగల్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

45
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇకపై కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపారు. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యింది... ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరికొందరు కలెక్టర్లు కూడా విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

55
తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవులే సెలవులు వచ్చాయి... భారీ వర్షాల నేపథ్యంలో ఈ సెలవులు ఈ వారం కూడా కొనసాగేలా ఉన్నాయి. ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతంతో ప్రారంభమైన సెలవులు గత ఆదివారం (ఆగస్ట్ 17) వరకు కొనసాగాయి. ఆగస్ట్ 9 రాఖీపౌర్షమి, ఆగస్ట్ 10 ఆదివారం, ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్ట్ 16 శ్రీకృష్ణాష్టమి, ఆగస్ట్ 17 ఆదివారం సెలవులు వచ్చాయి.

ఆగస్ట్ 13, 14 తేదీల్లో భారీ వర్షసూచనలతో తెలంగాణలోని హన్మకొండ, జనగామ, వరంగల్, భువనగిరి, మహబూబాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవులు వచ్చాయి. ఇక హైదరాబాద్ లో కూడా కొన్ని విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి. ఐటీ, ఇతర రంగాల్లోని ఉద్యోగుకులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని నగరంలోని సంస్థలకు ప్రభుత్వం సూచించింది. ఇలా గత పదిరోజులుగా విద్యార్థులు, ఉద్యోగులకు భారీ వర్షాల కారణంగా సెలవులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం లభించింది.

Read more Photos on
click me!

Recommended Stories