మహబూబ్ నగర్ లో కుండపోత వర్షం... మోకాల్లోతు నీటిలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన

First Published Sep 5, 2021, 12:10 PM IST

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటమునిగిన ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోకాల్లోతు నీటిలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. 

మహబూబ్‌నగర్: గతకొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇలా మహబూబ్ నగర్ పట్టణంలో భారీ వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పెద్ద చెరువులో నీటిమట్టం పెరిగి మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా రామయ్య బౌలి, శివశక్తి నగర్, బికే రెడ్డి కాలనీ, క్రిస్టియన్ పల్లి, లక్ష్మీ నగర్ కాలనీల్లో ప్రాంతాల్లో వర్షపు నీరు వాగును తలపించేలా ప్రవహించింది. ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 


భారీ వర్షంతో పట్టణంలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం నాలుగు గంటలకే పోలీసులు, మున్సిపల్ అధికారులను వెంటపెట్టుకుని మోకాళ్ల లోతు నీటిలోనే మంత్రి పర్యటన సాగించారు. స్వయంగా పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలను అక్కడికక్కడే సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. .

భారీ వర్షం కారణంగా ఇబ్బందిపడుతున్న ప్రజలతో మాట్లాడారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.  

ఇక మరో నాలుగురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని రోజులు వర్షం ముప్పు పొంచివుందన్న నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళలోంచి బయటకు రావద్దని... వాగులు,వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. 

click me!