Published : May 23, 2025, 07:45 AM ISTUpdated : May 23, 2025, 07:52 AM IST
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరీముఖ్యంగా ఓ నాలుగు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ జిల్లాలేవి
Andhra Pradesh and Telangana Weather : సాధారణంగా మే నెలలో ఎండలు మండిపోతాయి... కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం చూస్తే అసలిది ఎండాకాలమా? వానాకాలమా? అన్న అనుమానం వచ్చేలా వర్షాలు కురుస్తున్నాయి. ఏదో చెదుమదురు జల్లులు కురవడం కాదు వరదలు వచ్చేలా, నడి వర్షాకాలంలో మాదిరిగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నారు. ఇవేం వానల్రా బాబు..! అనుకునే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంది.
26
మరికొద్దిరోజులు వర్షాలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చాలవన్నట్లు మరికొద్దిరోజులు ఇవి కొనసాగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. తెలంగాణలో అయితే భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈనెల 27 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. వీటికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
36
ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం మాత్రం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఉరుములు మెరుపులు, పిడుగులు పడటం, ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు... మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
ఇక హైదరాబాద్ లో గత రెండుమూడు రోజులనుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి... వర్షపునీటితో రోడ్లన్ని జలయమం అవుతుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇలా భారీ వర్షాలతో సతమతం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు ఇవాళ(శుక్రవారం) కాస్త ఊరట లభించనుందట... నగరంలో వర్షం కురిసే అవకాశం లేదని, అక్కడక్కడ కురిసినా చిరుజల్లులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
56
ఏపీకి తుపాను హెచ్చరిక
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాలు తోడయి భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
66
తెలుగోళ్లు బిఅలర్ట్
కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవొచ్చని తెలిపారు. మిగతాప్రాంతాల్లో వర్షాలు కురవకున్నా మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడుతుందని తెలిపారు.
ఏపీలో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని... చాలాచోట్ల గంటకు 30-60 కిలోమీటర్ల వేగంతో, అక్కడక్కడ 70 కి.మీ వరకు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.