CRY: 'తెలంగాణలో ప్రజారోగ్యం రాజ్యాంగ హక్కుగా కావాలి'

First Published | Nov 16, 2024, 1:14 PM IST

public health : తెలంగాణలో ప్రజారోగ్యం రాజ్యాంగ హక్కుగా కావాలనీ,  చట్టం కోసం ఆరోగ్య నిపుణుల కన్సల్టేషన్ పిలుపునిచ్చింది. 
 

Child Rights and You

Child Rights and You : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంపూర్ణ, సమగ్ర, సమ్మిళత ఆరోగ్య సంరక్షణ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక రాజ్యాంగ బద్ధమైన హక్కుగా పొందుపరిచేలా ప్రత్యేక చట్టం చేయాలని ఆరోగ్యనిపుణులు, సామాజిక కార్యకర్తల కన్సల్టేషన్ పిలుపునిచ్చింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సీఆర్‌వై - చైల్డ్ రైట్స్ అండ్ యు, హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు "అందరికీ ఆరోగ్యం" అంశంపై కన్సల్టేషన్ వర్క్‌షాప్ నిర్వహించింది.
 
ప్రతి వ్యక్తికీ శారీరక, మానసిక, సామాజిక, పర్యావరణ శ్రేయస్సు లభించే విధంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సాధన లక్ష్యంగా ప్రభుత్వ ప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండటం, జవాబుదారీతనం ఉండే వ్యవస్థ రూపకల్పన తదితర ముఖ్యమైన అంశాలను పరిష్కరిస్తూ.. ప్రజారోగ్యం, సామాజిక న్యాయం, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యత ఇచ్చేలా సమగ్ర ఆరోగ్య హక్కు చట్టం చేయాలని ఈ వర్క్‌షాప్ చివ‌రి రోజున‌ ఒక డిక్లరేషన్‌ను ఆమోదించింది. 

"తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యం ఒక ప్రాథమిక హక్కుగా చేయాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. అందరికీ ఆరోగ్యం అనే కీలక అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం" అని వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతినిధులు ప్రకటించారు. 

Child Rights and You

ఆరోగ్య వ్యవస్థలో అంతరాలు, మౌలిక సదుపాయాల అవసరాలు

పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి వైద్యసేవల సంస్థలు, ఆస్పత్రుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపర్చడం, వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం, ఎప్పటికప్పుడు బలోపేతం చేయడం జరగాలి అని ఈ వర్క్‌షాప్ పేర్కొంది. అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. దీని కోసం వైద్య సేవలు సార్వత్రికంగా అందుబాటులో ఉండేలా చూడడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను పెంపొందించడం, ప్రైవేటు ఆసుపత్రుల ప్రమాణాలకు దీటుగా ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాల నాణ్యతను పెంచడం.. చేపట్టవలసిన చర్యలని చెప్పింది. 

అలాగే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ)లో  అవసరమైన మందులు, వ్యాక్సిన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడంతో పాటు.. పౌరుల సామాజిక-ఆర్థిక నేపథ్యాలు, హోదాలు అనేవి వారికి లభించే వైద్య సేవలు నాణ్యత మీద ప్రభావం చూపకుండా చేయాల్సిన అవసరాన్ని ఈ వర్క్‌షాప్ ప్రముఖంగా ప్రస్తావించింది. 

Latest Videos


Child Rights and You

సీఆర్‌వై సౌత్ రీజియన్ ప్రోగ్రామ్ జనరల్ మేనేజర్ పీటర్ సునీల్ ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ.. తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని వైరుధ్యాలను ప్రస్తావించారు. కొన్ని ఆరోగ్య సూచికలను పరిశీలిస్తే.. పురోగతిలో చాలా అసమానతలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి పోషకాహార లోపాలను పరిష్కరించడం, వైద్య సేవలు అందించడంలో అంతరాలను రూపుమాపడం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

"అందరికీ ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ముందుకు తీసుకురావడానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వంతో సహకరిస్తూ పనిచేయడానికి సీఆర్‌వై కట్టుబడి ఉంది" అని ఆయన అన్నారు.

వర్క్‌షాప్‌లో కీలక అంశాలు

ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీనియర్ వైద్య నిపుణులు, ప్రజారోగ్య కార్యకర్తలు, పౌర సమాజ నిపుణులు, పాత్రికేయ నిపుణుల బృందం.. హాజరైన ప్రతినిధులకు విలువైన దృక్పథాలను అందించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) మాజీ డిప్యూటీ డైరెక్టర్ వీణా శత్రుఘ్న, అందరికీ ఆరోగ్యం అనే దానికి నాణ్యమైన పోషకాహారం పునాదిగా ఉండాలని చెప్పారు. ఈ క్రమంలో ఆరోగ్యానికి - పోషకాహారానికి గల సంబంధాన్ని తమ అధ్యయనాల్లో కనుగొన్న విషయాల ద్వారా వివరించారు.

నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకిషన్, మారుమూల అటవీ ప్రాంతాలలో నివసించే గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను ఎత్తిచూపారు. వారికి తగిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను పొందుపరచాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. కందారే, నీటిలో ఫ్లోరైడ్ వంటి కలుషితాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి సోదాహరణంగా వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుబాటులో ఉండాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

జన స్వాస్థ్య అభియాన్ (జేఎస్ఎస్) జాతీయ కన్వీనర్ అమూల్య నిధి, భారతదేశంలో ప్రభుత్వ ఆరోగ్య విధానాల పరిణామం గురించి వివరించారు. అందరికీ ఆరోగ్యం అనేది రాజ్యాంగ బద్ధమైన హక్కుగా  ఉండాల్సిన అవసరం గురించి చర్చించారు. ప్రజారోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా పాత్ర గురించి సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ సమ్మెట నాగ మల్లేశ్వరరావు, పాశం యాదగిరి మాట్లాడుతూ.. ఆరోగ్యం, వైద్య సేవల విషయంలో ప్రజా సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యలకు వార్తల్లో ప్రాధాన్యం ఇచ్చేలా స్థానిక పాత్రికేయుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. అలాగే, సమస్యలను సమాజం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకోవచ్చునని సూచించారు.

ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ విజయ్ కుమార్, క్రై రిసోర్స్ ఫెలో హిమ బిందు.. తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు, సదుపాయాల విషయంలో ఎంపిక చేసిన జిల్లాల్లో క్షేత్ర స్థాయి అధ్యయనాల్లో గుర్తించిన సవాళ్లను ఈ వర్క్‌షాప్‌లో వివరించారు. సీఆర్‌వై సీనియర్ మేనేజర్, తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లీడ్ బడుగు చెన్నయ్య ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

డిక్లరేషన్‌లో కీలక అంశాలు:

తెలంగాణలో ‘అందరికీ ఆరోగ్యం’ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో వర్క్‌షాప్ ఈ కింది తీర్మానాలను చేసింది:

అవగాహన పెంచడం: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా చేయడం గురించి అవగాహన పెంపొందించడం
ఆరోగ్యానికి నిధుల పెంపు: ఆరోగ్య రంగానికి కేటాయింపులను 12 శాతానికి పెంచేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం.
వైద్యసేవలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా మెరుగుపరచడం: సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలి చూడడం.
మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం: పెరుగుతున్న అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా, వైద్య సేవలు, సదుపాయాలను క్రమం తప్పకుండా ఆధునీకరిస్తూ, అభివృద్ధి చేయడం.
ఆరోగ్య సమానత్వాన్ని, జవాబుదారీతనాన్ని పెంపొందించడం: సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా.. సంబంధిత బాధ్యుల్లో జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవడం.

అందరికీ ఆరోగ్యం బిల్లు సాధన కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఒక కీలకమైన ముందడుగు. తెలంగాణ ప్రజలందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే సమగ్ర వ్యవస్థ అవసరాన్ని ఈ వర్క్‌షాప్ బలంగా చాటింది.

click me!