పాలకుర్తి : క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు. తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా.. ఎదుటివారి జీవితాలను.. ముక్కుపచ్చలారని చిన్నారుల నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. కన్న బిడ్డలని కూడా చూడకుండా వారి మీద విష ప్రయోగం చేశాడో దుర్మార్గపు తండ్రి. భార్య మీద కోపంతో అభం శుభం తెలియని చిన్నారులకు విష ప్రయోగం చేశాడు.
దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకిపురంలో ఈ విషాద ఘటన సోమవారం వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించి ఎస్సై శ్రీకాంత్ ఈ మేరకు వివరాలు తెలిపారు. పదేళ్ల క్రితం జానకిపురం గ్రామానికి చెందిన గుండె శ్రీను అనే వ్యక్తికి అదే మండలంలోని దర్దేపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో వివాహమయ్యింది. వీరికి ముద్దులొలికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగ ప్రియ(9), నందిని(5), రక్షిత్ తేజ్(4). కాగా శ్రీను మేస్త్రి పని చేస్తుంటాడు. పెళ్లి తర్వాత కొద్దికాలం బాగానే ఉన్నా శ్రీను ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
భార్యను వేధించిన కేసులో ఒకసారి శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతడితో వేగలేక ధనలక్ష్మి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారి విషయంలో పెద్దమనుషులు కలగజేసుకొని రాజీ కుదిరించారు. దీంతో ఆమె తిరిగి కాపురానికి వచ్చింది.
ఇంత జరిగినా శ్రీను తీరులో ఎలాంటి మార్పు రాలేదు. చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. అతని తీరుతో తీవ్రంగా విసిగిపోయిన భార్య ఈసారి ఇద్దరు కూతుర్లను భర్త దగ్గరే వదిలేసి.. కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.
భార్య తనను విడిచి వెళ్లిపోవడం, పిల్లలను తన దగ్గరనే వదిలేయడం.. శీనుకు కోపాన్ని తెప్పించింది. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు.
అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు. ఆ సంగతి తెలియని ఆ చిన్నారులు ఇద్దరు కూల్ డ్రింకును తాగేశారు. ఆ తర్వాత వీరిద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఏమనిపించిందో తెలియదు కానీ వెంటనే కూతుర్లిద్దరినీ జనగామ ఆస్పత్రికి తరలించాడు.
అప్పటికే పెద్ద కుమార్తె నాగ ప్రియ పరిస్థితి విషయమించడంతో అక్కడి నుంచి ఎంజీఎం కు పంపించారు. చికిత్స పొందుతూ నాగ ప్రియ సోమవారం మరణించింది. చిన్న కూతురు నందిని పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఆమెను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన భార్య ధనలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీను పై పోలీసులు కేసు నమోదు చేశారు.