Dasara: దసరా పండగ అంటేనే మందు, విందు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దసరా సీజన్‌లో జరిగే మద్యం అమ్మకాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మందు బాబులు దుమ్ము రేపారు.
ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చింది. అయినా మద్యం అమ్మకాలు మాత్రం అసాధరణ స్థాయిలో జరిగాయి. అక్టోబర్ 2న మద్యం దుకాణాలు మూసివేస్తారని ముందే తెలుసుకున్న వినియోగదారులు, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపారు.
25
రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల అమ్మకాలు
ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ.333 కోట్ల మద్యం అమ్ముడైంది. అక్టోబర్ 1న మరో రూ.86 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లో కలిపి రూ.419 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఇది సాధారణ రోజులతో పోలిస్తే రెండింతల వృద్ధి అని అధికారులు పేర్కొన్నారు.
35
లిక్కర్, బీర్ విక్రయాల లెక్కలు
దసరా వారంలో మద్యం అమ్మకాలు దాదాపు రూ.1,000 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. మూడు రోజులలో 6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు సమాచారం. పండగ ఉత్సవాల వాతావరణం కారణంగా పార్టీలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల సమావేశాల కోసం మద్యం వినియోగం భారీగా పెరిగింది.
అక్టోబర్ 2న మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాలను కూడా ప్రభుత్వం మూసివేయాలని ఆదేశించింది. దీంతో వినియోగదారులు ఒక రోజు ముందే స్టాక్ చేసుకోవడానికి వైన్ షాపుల వద్ద క్యూ కట్టారు. వైన్స్ మూసివున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులు తెరిచినట్లు సమాచారం. స్థానికంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోలేదని చర్చ జరిగింది.
55
గతేడాదితో పోలిస్తే..
ఈ ఏడాది పండగ సీజన్‌లో మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 10–15 శాతం ఎక్కువయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ముందే సరఫరా చేయడం, డిస్ట్రిబ్యూటర్లు స్టాక్ అందుబాటులో ఉంచడం విక్రయాల పెరుగుదలకు కారణమని వారు స్పష్టం చేశారు. పండగ సమయంలో ఇలాగే భారీ విక్రయాలు జరగడంతో రాబోయే సంవత్సరాల్లో రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మరింత ముందుగానే వ్యూహాలు వేసే అవకాశం ఉందని అంచనా.