కేసీఆర్ తో పొత్తుకు పాకులాట : సిపిఎంకు ఒక్క అసెంబ్లీ సీటు ఆఫర్..

First Published | Jul 31, 2023, 11:10 AM IST

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంకు ఒక్క సీటు ఇస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రతిపాదించగా.. ఆ పార్టీ తిరస్కరించినట్లు సమాచారం.

హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకు వామపక్ష పార్టీల నేతలు సహకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తెరమీదికి వచ్చింది. అయితే సీపీఎంకు ఒక్క సీటు ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేకర్‌రావు ప్రతిపాదించగా.. దాన్ని సీపీఎం తిరస్కరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వామపక్షాలు, ముఖ్యంగా రాష్ట్ర సీపీఎం తెలంగాణలో ఒంటరిగా వెళ్లేందుకు జిల్లా నాయకత్వంతో సంప్రదింపులు ప్రారంభించింది.  మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు సీపీఎం పార్టీకి 'ఒక్క సీటు'ను కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 


వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతిస్తే రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఎంకి ఇస్తామని ప్రతిపాదనను కూడా బీఆర్‌ఎస్‌ పంపింది. "ముఖ్యమంత్రి ప్రతిపాదనలను మేం తిరస్కరించాం. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. తుది నిర్ణయం తీసుకుంటాం" అని సిపిఎం వర్గాలు తెలిపాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ కలిసి పనిచేశాయి. బీఆర్‌ఎస్‌, సీపీఎంల మధ్య పెద్దఎత్తున కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ ఆదివారం నగరంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 20 స్థానాల్లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. 

'బీజేపీకి వ్యతిరేకంగా మేము చేస్తున్న ఆందోళనలకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తే వారితో కలిసి పనిచేస్తాం' అని రాఘవులు చెప్పారు.

Latest Videos

click me!