Revanth Reddy
Kishan Reddy : కేంద్ర బడ్జెట్ 2024-25 లో అసలు తెలంగాణ ప్రస్తావనే లేదు. ఎన్డిఏ భాగస్వామ్య పార్టీలు అధికారంలో వున్న ఆంధ్ర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను ఈ బడ్జెట్ లో భారీ కేటాయింపులు జరిగాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బిజెపి అత్యధిక ఎంపీలను అందించిన రాష్ట్రం తెలంగాణ. అయినా మన రాష్ట్రానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని తెలంగాణ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలు ఆరోపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చ చేపట్టారు. తాజా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసారు.
Telangana Assembly
ఇవాళ(బుధవారం) అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుధీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ సభ్యులు కేంద్రం తీరును తప్పుబడుతూ ప్రసంగించారు. ఈ బడ్జెట్ లోనే కాదు గత పదేళ్లుగా కూడా కూడా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదనేలా సభ్యులు మాట్లాడారు. ఇలా తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన చర్చ, తీర్మానంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
kishan reddy
కిషన్ రెడ్డి కామెంట్స్ :
కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు ఎంతో చేసింది... ఇకపైనా చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికి, ప్రజా సంక్షేమానికి చిత్తశుద్దితో పనిచేసామన్నారు. మోదీ సర్కార్ పనితనాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టే ఈ లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి 35 శాతం ఓట్లు, 8 సీట్లు వచ్చాయన్నారు.
kishan reddy
ఎన్డిఏ అధికారంలోకి వచ్చినతర్వాత అంటే గత పదేళ్లలో ఒక్క తెలంగాణకే రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. అభివృద్ది, సంక్షేమ పథకాల రూపంలో ఇంతమొత్తం తెలంగాణపై ఖర్చు చేసామన్నారు. పన్నుల వాటా రూపంలో తెలంగాణకు రూ.2 లక్షల కోట్లు వచ్చాయన్నారు. వడ్డీ రాయితీల రూపంలో రూ.7 వేలకోట్లు తెలంగాణ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
kishan reddy
తెలంగాణలో రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కోసం వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.10,990 కోట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధికి గణనీయంగా నిధులిచ్చామని తెలిపారు.40 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి 11వేల కోట్లు ఖర్చుచేశామన్నారు.రామగుండంలో రూ.6300 కోట్లతో ఫెర్టిలైజర్ కంపెనీ ఏర్పాటుచేశామమన్నారు. బీబీనగర్ లో ఏయిమ్స్ ఆసుపత్రి దాదాపుగా పూర్తి కావస్తోంది అన్నారు. ఇలా తెలంగాణ కోసం ఎంతో చేస్తే ఏం చేసారని ప్రశ్నిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
KCR
కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం విడుదల చేసిన నిధులను సైతం దారిమళ్లించారని అన్నారు. ఇక ఉపాధిహామీ నిధులను ఎమ్మెల్యేలకు పంచిపెట్టి దుర్వినియోగం చేసారన్నారు. పంచాయితీరాజ్ సంస్థలకు నిధులిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు, మౌలిక వసతుల కల్పించడానికి వాడకుండా పక్కదారి పట్టించారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy
గతంలో కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించాడో అదే తరహాలో ఇప్పుడు రేవంత్ వ్యవహరిస్తున్నాడని అన్నారు. గత సీఎం బాటలోనే ఈ సీఎం కూడా నడుస్తుండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో ఈ ప్రభుత్వం కూడా విఫలమైంది... అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే నాటకాలు ఆడుతున్నారని అన్నారు. పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఇలా కేంద్రంమీద బురద జల్లుతున్నారని అన్నారు. గతంలో బిఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Revanth Reddy
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగిందన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఆర్థికసాయం చేయాలని గతంలో ఇదే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కోరాయి... ఇప్పుడు సాయం చేస్తే గగ్గోలు పెడుతున్నాయన్నారు. తాజా బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.