జింక, దుప్పి మాంసమంటూ ఎద్దు, ఆవు, పంది మాంసం అమ్మకం... ఎనిమిది మంది ముఠా అరెస్ట్

First Published Jul 9, 2021, 3:02 PM IST

దుప్పి, జింక మాంసమంటూ ఎద్దు, పంది మాంసాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిందితుల ముఠా పాపం పండి కటకటాలపాలయ్యారు. 

మంచిర్యాల: పొలంపనుల కోసం ఉపయోగించే ఎద్దులను దొంగిలించడమే కాదు వాటిని చంపి జింక, దుప్పి మాంసమంటూ ప్రజలకు అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎద్దులను దొంగిలించడం సాధ్యం కానప్పుడు ఆవు, పంది మాంసాన్ని కూడా జింక, దుప్పి మాంసంగా పేర్కొని ఈ ముఠా అమ్ముకునేవారు. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిందితుల పాపం పండి కటకటాలపాలయ్యారు.
undefined
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లాకు చెందిన మాణుగు రజినీకాంత్, ఎలిగేటి శ్రీనివాస్, కుమ్మరి కళ్యాణ్, దుగుట వెంకట స్వామి మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం నేరాల బాట పట్టారు. ఈ ముఠా మొదట చిన్నచిన్న దొంగతనాలు చేసి జల్సాలు చేసేవారు. అయితే ఇటీవలికాలంలో దొంగతనాలు చేయడం మానేసిన వీరు నయా మోసాన్ని మొదలుపెట్టారు.
undefined
గ్రామ శివార్లలో తిరిగే ఎడ్లను దొంగతనం చేయడమే కాదు వాటిని కోసి ఆ మాంసాన్ని జింక, దుప్పి మాంసంగా పేర్కొంటూ అమ్మేవారు. అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ముఖ్యంగా జైపూర్ మండలంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వచ్చే ఎద్దులను ఎవరూ కాపలా లేని సమయంలో దొంగింలించేవారు. రాత్రి సమయంలో వాటిని వధించి మాంసాన్ని ప్యాక్ చేసి గ్రామాల్లో తిరిగి అమ్మేవారు.ఆదివారం మరియు బుధవారం మాంసానికి గిరాకీ ఉండడంతో ఆ రోజుల్లోనే ఎక్కువగా నేరాలు చేసేవారు.
undefined
దొంగతనం సాధ్యపడని సందర్భాల్లో ఆవు, పంది మాంసం అమ్మే షాపులు నుండి రూ.400కు కిలో చొప్పున కొనుగోలు చేసి దాన్ని అమాయక ప్రజలను దుప్పి, జింక మాంసంగా నమ్మించి రూ.800 కిలో చొప్పున అమ్మేవారు. ఇలా మోసాలకు పాల్పడగా వచ్చిన డబ్బుతో తాగి తందనాలాడుతూ జల్సా చేసేవారు.
undefined
గత ఆరు నెలలుగా జైపూర్, నెన్నల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవులు, ఎద్దుల దొంగతనం కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రత్యేక గస్తీ నిర్వహించడంతో ఈ దొంగల ముఠా చిక్కింది. వీరిని అరెస్ట్ చేయడంతో పాటు 02 ఆటోలు, 01 గొడ్డలి, 06 కత్తులూ,100 కవర్లు, 06 సెల్ ఫోన్లు 02 టార్చ్ లైట్లు, 6,500 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
undefined
click me!