జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. ఆయనను బీఆర్ఎస్ లోకి ఎలా తీసుకుంటారు...??...

First Published Aug 18, 2023, 8:53 AM IST

బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి చేరికపై పలు అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. మెదక్ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మంత్రి హరీష్ రావును కలిసి జగ్గారెడ్డిని చేర్చుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. 

మెదక్ : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే  కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ లోకి  చేరబోతున్నారు. అయితే, జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో  చేర్చుకోవద్దంటూ మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తులు వెల్లివెత్తుతున్నాయి. హైదరాబాదులోని మంత్రి హరీష్ రావు నివాసానికి సుమారు 200 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు.. తరలివచ్చారు. 

జగ్గారెడ్డి చేరికపై తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ విజ్ఞప్తులు  అందించారు. జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశాడని..  తెలంగాణ ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం కోసం బోగస్ హామీలు ఇచ్చాడని.. తన నియోజకవర్గ ప్రజలను కూడా ఆ విధంగా మోసం చేశాడని ఆరోపించారు. 

జగ్గారెడ్డి నాలుగున్నర ఏళ్లలో ఏనాడూ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదన్నారు.. అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కే ఇవ్వాలని, జగ్గారెడ్డికి ఇవ్వొద్దని తెలిపారు. 

చింతా ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా పేరొందారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

తమ పార్టీ నాయకుడైన చింతా ప్రభాకర్ కే  టికెట్ ఇవ్వాలని..  పార్టీ శ్రేణులంతా కలిసి అక్కడ చింతా ప్రభాకర్ ను గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. తాము చేసిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హరీష్ రావు హామీ ఇచ్చినట్లుగా పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు.

సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ముఖ్యనేతలంతా.. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కోరుతూ నెల రోజుల క్రితం ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వారు జగ్గారెడ్డిని పార్టిలో చేర్చుకోవద్దంటూ ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేశారు. ప్రస్తుతం జగ్గారెడ్డి త్వరలో బిఆర్ఎస్ లో చేరుతన్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పార్టీ శ్రేణులంతా మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్లి, విజ్ఞప్తి చేశారు.  ప్రస్తుతమిది చర్చనీయాంశంగా మారింది.

click me!