రేపటినుంచి తెలంగాణలో బోనాల పండుగ షురూ....

First Published | Jun 21, 2023, 1:30 PM IST

రేపటినుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. మొదటగా గోల్కండలో ఈ ఉత్సవాలు గురువారం నాడు మొదలవుతాయి. 
 

హైదరాబాద్ : తెలంగాణలో యేటా అంగరంగవైభవంగా జరిగే ఆషాడ బోనాలు ఈనెల 22 వ తేదీ నుండి అంటే రేపటినుంచి ప్రారంభం కాబోతున్నాయి. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు మొట్టమొదటగా గోల్కొండ బోనాలతో ప్రారంభం అవుతాయి. 

లంగర్ హౌస్ లో నిర్వహించే  గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాలకు లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 


మంత్రి తలసాని ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో  సమీక్షలు జరిపారు. ఆషాడ బోనాల ఉత్సవాలతో నెల రోజులపాటు జంటనగరాలు సందడిగా మారనున్నాయి. 

దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, బీఆర్ఎస్ ఎంపీలు కే ఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. 

ఇక తెలంగాణ భవన్ పరిసరాల్లో జరిగే బోనాల ఊరేగింపులో బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. అమ్మవారికి బీఆర్ఎస్ ఎంపీలు కే ఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డిలు బంగారు బోనం సమర్పించారు. 

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఆషాడ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని మే 26న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

నగరంలో ఆషాడ బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్ లు సమీక్ష నిర్వహించారు. 

Latest Videos

click me!