భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలో దళిత యువకుడు టిఆర్ఎస్ నాయకుల చేతిలో హత్యకు గురయ్యాడన్న వార్తలపై వాస్తవాలు తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిజ నిర్ధారణ కమిటీ వేసిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అయితే నిజానిజాలు తెలుసుకునేందుకు మల్లారంకు బయలుదేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తితో పాటు తనను కూడా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.
అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బిజెపి శాసన సభాపక్ష నాయకులు రాజా సింగ్ తదితరులను రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా అరెస్టు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగితే విషయాలు తెలుసుకోవడం తగిన విధంగా న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం రాజకీయ పార్టీలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని... తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులను బాధ్యతలను హరించివేస్తున్నారని మండిపడ్డారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని... దీనిని ప్రజాస్వామ్య వాదులందరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ముందస్తు అరెస్టులు ఎందుకోసం చేస్తున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా వచ్చిందన్న విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం మరిచి పోయిందని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల హక్కులను, రాజకీయ పార్టీల బాధ్యతలను పూర్తిగా అడ్డుకొని రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియకుండా చేయాలనే నిరంకుశ ధోరణి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నియంతృత్వ ధోరణికి నిదర్శనమని... వీరికి రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు ప్రేమేందర్ రెడ్డి.