Sankranti Holidays : సాఫ్ట్ వేర్, బ్యాంక్ ఉద్యోగులకూ నాలుగు రోజుల సంక్రాంతి సెలవులు

First Published | Jan 1, 2025, 7:26 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకే కాదు ప్రైవేట్, బ్యాంక్ ఉద్యోగులకు కూడా ఈ సంక్రాంతికి నాలుగురోజుల సెలవులు వస్తున్నాయి. ప్రభుత్వం కేవలం రెండ్రోజులే సంక్రాంతి సెలవులు ఇచ్చాయి... మరి నాల్రోజుల సెలవులేంటని అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. 

Sankranti Holidays for Employees

Sankranti Holidays : తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇది పెద్దపండగ. ఉద్యోగాలు, ఉపాధి కోసం పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదిలి ఎక్కడెక్కడో వుంటున్నవారు సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకుంటారు. హైదరాబాద్ తో పాటు దేశ నలుమూలల నుండే కాదు విదేశాల నుండి కూడా సొంతూళ్ళకు వస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

పల్లెల నుండి ఉద్యోగాలు, ఉపాధి కోసం పట్నంకు వలసలు సాగుతుంటాయి. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు చాలామంది వలసవచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఇలాంటివారితో పాటు తాత్కాలికంగా నివాసముంటున్నవారు కూడా సంక్రాంతి ఊళ్లబాట పడతారు... ఇలా ఈ పండగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ ఖాళీ అవుతుంది.

ఇక ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల పరిస్థితి కూడా ఇంతే. ఇక్కడ స్థిరపడ్డవారు కూడా సంక్రాంతికి సొంతూళ్లకు పయనం అవుతారు. ఇలా ఎక్కడెక్కడికో వలసవెళ్లినవాళ్లంతా రావడంతో సంక్రాంతి పండగ వేళ పల్లెలు కలకలలాడుతుతుంటాయి.  

ఇక ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ఈ సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. కాబట్టి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఇప్పటినుండే బస్సులు, రైలు టికెట్స్ బుకింగ్ చేసే పనిలో పడ్డారు. ముందుగా భార్యాపిల్లలను పంపించి పండగ సమయంలో తాము వెళ్లేలా ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటివారికి గుడ్ న్యూస్... ఈ సంక్రాంతి వేళ మరిన్ని సెలవులు కలిసివస్తున్నాయి. 

Sankranti Holidays for Employees

ప్రైవేట్ ఉద్యోగులకు సంక్రాంతి సెలవులు : 

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైన పండగ సంక్రాంతి. మూడు రోజులపాటు జరిగే ఈ పండగను కుటుంబసభ్యులతో కలిసి సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి ఇది సాద్యమయ్యే పనికాదు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కాస్త నయం... ఏదోలా పండక్కి సెలవు తీసుకునే అవకాశం వుంటుంది... కానీ ప్రైవేట్ ఉద్యోగులకు వరుసగా సెలవులు తీసుకోవడం కుదరదు. కాబట్టి కేవలం జనవరి 14న పండగపూటే కుటుంబంతో వుండి...మళ్ళీ హడావిడిగా ఉద్యోగ ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. 

అయితే ఈ సంక్రాంతి అలాకాదు... ప్రైవేట్ ఉద్యోగులకు కూడా కలిసివచ్చింది. పండగ సోమవారం వస్తుండటంతో ముందు రెండ్రోజులు కలిసివస్తోంది. చాలా మల్టి నేషనల్ సంస్థలు మరీముఖ్యంగా సాప్ట్ వేర్ కంపనీలు సాధారణంగా శని,ఆదివారం రెండ్రోజులు ఉద్యోగులకు సెలవు ఇస్తుంటాయి. ఇలా రెండ్రోజులు వీకెండ్ సెలవు వుండే ఉద్యోగులకు ఈ సంక్రాంతికి నాలుగురోజులు సెలవు వస్తోంది. శనివారం సాధారణ సెలవు లేనివారికి కూడా ఆదివారం సెలవుతో కలిపి మూడ్రోజుల సంక్రాంతి సెలవులు వస్తున్నాయి.

జనవరి 11 నుండి 15  వరకు ఉద్యోగులకు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. జనవరి 11 శనివారం, 12 ఆదివారం సాధారణ సెలవు. ఇక జనవరి 13 సోమవారం భోగి, జనవరి 14 మంగళవారం సంక్రాంతి సందర్భంగా ఏపీతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అధికారికంగా సెలవు ఇస్తున్నాయి. అంటే వీకెండ్ రెండ్రోజులు, ప్రభుత్వ సెలవులు రెండ్రోజులు... మొత్తంగా సంక్రాంతికి ఉద్యోగులకు నాలుగురోజుల సెలవులు వస్తున్నాయి. 
 


Sankranti Holidays for Employees

ప్రభుత్వ, బ్యాంక్ ఉద్యోగులకు కలిసివస్తున్న రెండో శనివారం : 

ప్రభుత్వ, బ్యాంక్ ఉద్యోగులకు కూడా సంక్రాంతికి మరో సెలవు కలిసివస్తోంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు శనివారం పనిచేస్తాయి... కానీ ప్రతి నెలలో రెండో శనివారం మాత్రం సెలవు వుంటుంది. సరిగ్గా సంక్రాంతి పండక్కి ముందు అంటే జనవరి 11న రెండో శనివారం వస్తోంది. కాబట్టి అప్పటినుండి నాలుగు రోజులపాటు ప్రభుత్వ,బ్యాంక్ ఉద్యోగులకు సంక్రాంతి సెలవులన్నమాట. 

ఇలా ఎలాంటి సెలవులు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగులు సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లవచ్చు... కుటుంబంతో హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఆడవాళ్లయితే ఇంటిముందు ముగ్గులేసి,గొబ్బెమ్మలు పెట్టి సందడి చేయవచ్చు... రకరకాల పిండివంటలు చేసి ఇంటిళ్లిపాదికి రుచి చూపించవచ్చు. ఇక మగవాళ్లు కోడి పందాలు, భోగి మంటలతో సందడి చేయవచ్చు. వరుస సెలవులు కలిసిరావడంతో ఈ సంక్రాంతిని జీవితంలో గుర్తుండిపోయేలా అంబరాన్నంటే సంబరాలతో జరుపుకోవచ్చు. 

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు జనవరి 11,12,13,14 తేదీల్లో సెలవులు పూర్తిచేసుకుని తిరిగి జనవరి 15న ఉద్యోగాలకు వెళతారు. ఇక స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువతీయువకులు జనవరి 10 నుండి 19 వరకు అంటే పది రోజులపాటు సంక్రాంతి సెలవుల్లో ఎంజాయ్ చేయవచ్చు. తిరిగి జనవరి 20 సోమవారం విద్యాసంస్థలు పున:ప్రారంభం అవుతాయి.

ఏపీలో స్కూళ్ళకు సంక్రాంతి సెలవులపై అధికారులు క్లారిటీ ఇచ్చారు... తెలంగాణలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. కానీ హైదరాబాద్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా వుంటున్నారు... వారిని దృష్టిలో వుంచుకుని ఇప్పటికే పలు విద్యాసంస్థలు పదిరోజులపాటు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి :
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ ... ఇంతకూ 5 రోజులా? 10 రోజులా?

Sankranti Holidays : ఏపీలో ఈసారి సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులో తెలుసా?

Latest Videos

click me!