
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ల్యాప్‌టాప్ వరకు, టీవీ నుంచి స్మార్ట్‌హోమ్ పరికరాల వరకు ప్రతిదీ వైఫైతోనే కనెక్ట్ అయి ఉంటుంది. మనం నిత్య జీవితంలో వైఫై భాగమైపోయింది. అది లేనిది మనకు క్షణం కూడా గడవం లేదు. ఇళ్లు, ఆఫీస్, కారుడు, ఫంక్షన్ హాల్, హోటల్స్ ఇలా ఎక్కడ చూసినా వైఫై ఉండాల్సిందే. ఇంటర్నెట్ వాడకంలో వైఫై కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఈ వైఫై టెక్నాలజీ వెనుక ఎవరు ఉన్నారు? అసలు వైఫైని ఒక్క వ్యక్తి కనిపెట్టారా? దీని రూపకల్పన ఎలా జరిగింది? ఏ దేశం ఆశిష్కరించింది? దీని వెనకున్న కథేంటో తెలుసుకుందాం.
వైఫై ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ జాన్ ఓ సుల్లివన్. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజినీర్. అయితే వైఫైని ఆయన ఒక్కరే కనిపెట్టలేదు. జాన్ ఓ సుల్లివన్ నాయకత్వంలో ఆస్ట్రేలియాలోని CSIRO (కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) పరిశోధనా సంస్థకు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలు కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ బృందంలో టెర్రీ పెర్సివల్, డైట్‌హెల్మ్ ఓస్ట్రీ, గ్రాహమ్ డేనియల్స్, జాన్ డీన్ కూడా ఉన్నారు.
(వై-ఫై) అనేది వైర్లు (కేబుల్స్) అవసరం లేకుండా, రేడియో తరంగాల (Radio waves) ద్వారా ఇంటర్నెట్‌ను, పరికరాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసే ఒక వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ టెక్నాలజీ. చాలా మంది Wi-Fi అంటే `Wireless Fidelity` అని అనుకుంటారు. కానీ టెక్నాలజీ నిపుణుల ప్రకారం దీనికి అధికారికంగా పూర్తి పేరు లేదట. మార్కెటింగ్ కోసం "Hi-Fi" (High Fidelity) అనే పదానికి దగ్గరగా ఉండేలా ఈ పేరును పెట్టారని నిపుణులు చెబుతుంటారు.
వైఫై ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 1970లలో జాన్ ఓ సుల్లివన్ రేడియో ఖగోళ శాస్త్రంపై పరిశోధనలు చేశారు. అంతరిక్షం నుంచి వచ్చే రేడియో తరంగాలను విశ్లేషించేందుకు ఆయన ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ (FFT) అనే టెక్నాలజీని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ రీసెర్చ్ లో భాగంగా రేడియో తరంగాలను వేగంగా విశ్లేషించే పద్ధతులు ఆయనకు అర్థమయ్యాయి. అనంతరం కంప్యూటర్ల మధ్య వేగంగా, వైర్లు లేకుండా సమాచారాన్ని పంపించేందుకు ఇదే సూత్రాలను ఉపయోగించవచ్చని గుర్తించారు.
1990ల ప్రారంభంలో ల్యాప్‌టాప్‌లు, పోర్టబుల్ కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వైర్లు లేకుండా కంప్యూటర్లను అనుసంధానించే అవసరం ఏర్పడింది. అయితే గదుల్లో రేడియో తరంగాలు గోడలు, ఫర్నిచర్‌కు తగిలి ప్రతిధ్వనించడం వల్ల సిగ్నల్ దెబ్బతినేది. దీనిని పరిష్కరించడమే CSIRO బృందం ముందున్న ప్రధాన సవాలు.
అనేక ఫ్రీక్వెన్సీలపై ఒకేసారి సమాచారాన్ని పంపించి, రిసీవర్ వద్ద వాటిని తిరిగి కలిపే విధానాన్ని అభివృద్ధి చేశారు. దీంతో సిగ్నల్ నాణ్యత దెబ్బతినకుండా వేగంగా డేటాను పంపించడం సాధ్యమైంది. 1992లో ఈ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ దరఖాస్తు చేశారు. 1993లో ప్రోటోటైప్‌ను రూపొందించారు. 1996లో అమెరికాలో పేటెంట్ మంజూరైంది. కాకపోతే కనిపెట్టిన వాళ్లు మాత్రం ఆస్ట్రేలియన్స్ కావడం విశేషం. అక్కడే దీన్ని మొదట ఉపయోగించారు.
జాన్ ఓ సుల్లివన్ గురించి చూస్తే, ఈ సైంటిస్ట్ ఒక రంగంలో చేసిన పరిశోధనను మరో రంగంలో ఉపయోగించి ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణకు పునాది వేశారు. అంతరిక్ష పరిశోధనల కోసం అభివృద్ధి చేసిన సిగ్నల్ ప్రాసెసింగ్ సాంకేతికతను కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌లో ఉపయోగించారు. వైఫై ఆవిష్కరణకు గుర్తింపుగా 2009లో ఆయనకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సైన్స్ ప్రైజ్ లభించింది. 2012లో ఆయన బృందానికి యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు కూడా దక్కింది.
వైఫై సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఇంటర్నెట్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కంప్యూటర్లకు మాత్రమే పరిమితమైన వైర్‌లెస్ కనెక్టివిటీ.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కెమెరాలు, ప్రింటర్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలకు విస్తరించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వైఫైని ఉపయోగిస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడం, ఆన్‌లైన్ విద్య, వీడియో కాల్స్, డిజిటల్ సేవలు ఇలా అనేక రంగాల్లో వైఫై కీలకంగా మారింది. ఒకప్పుడు అంతరిక్షంలోని రేడియో తరంగాలను అధ్యయనం చేసేందుకు చేసిన పరిశోధనలు.. నేడు ప్రపంచాన్ని వైర్‌లెస్‌గా అనుసంధానిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఫై ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏఐ టెక్నాలజీని కూడా వైఫై నడిపిస్తుండటం విశేషం. అది లేకుండా ఈ ప్రపంచాన్ని, టెక్నాలజీని ఊహించడం కష్టమే.