మీరు స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా..? అయితే దాని వెనకాల ఓ గ్రీన్ లైట్ తరచుగా బ్లింక్ అవ్వడం గమనించే ఉంటారు? అది కేవలం డిజైన్ కాదు, దాని వెనుక ఓ ముఖ్యమైన సైన్స్ టెక్నాలజీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్‌వాచ్ వాడేవాళ్లు దీన్ని కచ్చితంగా గమనించి ఉంటారు. వాచ్‌ను చేయి నుంచి తీయగానే, దాని వెనుక భాగంలో ఓ పచ్చ లైట్ మిణుకుమిణుకు మంటుంది. చాలామంది దీన్ని ఏదో డిజైన్ లేదా ఛార్జింగ్ ఇండికేటర్ అనుకుంటారు. కానీ నిజానికి ఈ చిన్న పచ్చ లైటే మీ స్మార్ట్‌వాచ్‌లో అత్యంత కీలకమైన భాగం. మీ హార్ట్ రేట్, పల్స్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను లెక్కించేది ఈ లైటే.
24
పీపీజీ (PPG) సెన్సార్ అంటే ఏమిటి?
ఈ టెక్నాలజీ పేరు పీపీజీ (PPG) సెన్సార్. దీని పూర్తి పేరు ఫోటోప్లెతిస్మోగ్రఫీ (Photoplethysmography). కాంతి ఎలా ప్రతిఫలిస్తుందనే దాని ఆధారంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులోని హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్, ఆకుపచ్చ రంగు కాంతిని బాగా గ్రహిస్తుంది. స్మార్ట్‌వాచ్ వెనుక ఉన్న గ్రీన్ ఎల్ఈడీ (LED) లైట్ వెలిగినప్పుడు, ఆ కాంతి మన చర్మాన్ని దాటి రక్తనాళాలపై పడుతుంది.
గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు రక్త ప్రవాహం పెరిగి గ్రీన్ లైట్ ఎక్కువగా గ్రహించబడుతుంది. అదే సమయంలో గుండె రక్తాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు కాంతి తక్కువగా గ్రహించబడి సెన్సార్‌కు తిరిగి వస్తుంది. ఇలా కాంతిని గ్రహించడం, తిరిగి పంపడం మధ్య ఉన్న తేడా ఆధారంగానే మీ వాచ్ హార్ట్ బీట్‌ను లెక్కిస్తుంది.
34
ఆకుపచ్చ లైటే ఎందుకు?
ఇప్పుడు ఓ ప్రశ్న రావచ్చు. ఎరుపు లేదా నీలం రంగు లైట్లను కాకుండా, పచ్చ లైట్‌నే ఎందుకు వాడుతున్నారు? దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది ఆకుపచ్చ కాంతి తరంగదైర్ఘ్యం (wavelength) మన రక్తంలోని ఎరుపు రంగు వల్ల బాగా గ్రహించబడుతుంది. అందువల్ల, హార్ట్ రేట్‌ను కొలిచేటప్పుడు చాలా కచ్చితమైన ఫలితాలు వస్తాయి.
రెండో కారణం, పచ్చ లైట్ చర్మంలోకి మరీ లోతుగా వెళ్లదు. దీనివల్ల మనం నడుస్తున్నప్పుడు, చేతులు కదిపినప్పుడు సెన్సార్ డేటాను కోల్పోదు. కానీ ఎరుపు లేదా ఇన్‌ఫ్రారెడ్ కాంతి చర్మంలోకి చాలా లోతుగా వెళ్తుంది. దీనివల్ల కదలికల కారణంగా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు గ్రీన్ లైటే ఉత్తమమైనది.
అయితే, ఈ లైట్ రోజంతా వెలుగుతూ ఉంటే మీ వాచ్‌లో ఏదో సమస్య ఉందని అర్థం కాదు. మీరు వాచ్‌ను చేతికి కట్టుకున్నప్పుడు, అది కొన్ని సెకన్లకు ఒకసారి మీ హార్ట్ రేట్‌ను చెక్ చేస్తూనే ఉంటుంది. మీరు వర్కవుట్ మోడ్ ఆన్ చేసినప్పుడు, ప్రతి హృదయ స్పందనను లెక్కించడానికి ఈ లైట్ మరింత వేగంగా వెలుగుతుంది. కాబట్టి, తర్వాతిసారి ఈ పచ్చ లైట్‌ను చూసినప్పుడు, మీ వాచ్ మీ గుండెను జాగ్రత్తగా చూసుకుంటోందని అర్థం చేసుకోండి.