రోజూ కోట్ల మంది ఉచితంగా గూగుల్ సెర్చ్ చేస్తారు.. అయినా ఆ సంస్థ వేల కోట్లు ఎలా సంపాదిస్తోంది

Published : Nov 22, 2026, 08:45 AM IST

Google Earnings: చిన్న సందేహం నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ప్రశ్నకు గూగుల్‌లో సమాధానం దొరుకుతుంది. ఈ సేవలను మనం ఉచితంగానే ఉపయోగించుకుంటున్నాం. మరి సేవలను ఉచితంగా అందిస్తున్న గూగుల్‌ ఎలా సంపాదిస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా.?

PREV
15
ప్రకటనలే గూగుల్‌కు ప్రధాన ఆదాయ వనరు

గూగుల్‌కు అత్యధిక ఆదాయం ప్రకటనల (Advertisements) ద్వారానే వస్తుంది. మనం గూగుల్‌లో ఏదైనా విషయం గురించి వెతికినప్పుడు కొన్ని వెబ్‌సైట్లు సెర్చ్ ఫలితాల్లో మొదట కనిపిస్తాయి. వాటి పక్కన Sponsored లేదా Ad అనే పదాలు ఉంటాయి. ఇవి డబ్బులు చెల్లించి ప్రచారం చేసుకునే ప్రకటనలు. ఉదాహరణకు మీరు రూ.15 వేలలోపు మంచి మొబైల్ కోసం గూగుల్‌లో వెతికారనుకుందాం. అప్పుడు కొన్ని మొబైల్ కంపెనీల ప్రకటనలు సెర్చ్ ఫలితాల్లో మొదట కనిపిస్తాయి. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ మందికి చేరవేయడానికి గూగుల్‌కు డబ్బులు చెల్లిస్తాయి. ఇలా ప్రకటనలను చూపించడం ద్వారా గూగుల్ భారీగా ఆదాయం సంపాదిస్తుంది. ముఖ్యంగా ప్రకటనలపై వినియోగదారులు క్లిక్ చేసినప్పుడు కొన్ని రకాల ప్రకటనల్లో గూగుల్‌కు ఆదాయం వస్తుంది.

25
మన సెర్చ్ వివరాల ఆధారంగా ప్రకటనలు

గూగుల్ ఆదాయం వెనుక మరో ముఖ్యమైన విషయం మన సెర్చ్ అలవాట్లు. మనం ఏ విషయాల గురించి ఎక్కువగా వెతుకుతున్నాం? ఎలాంటి వస్తువులపై ఆసక్తి చూపిస్తున్నాం? ఏ రకమైన వెబ్‌సైట్లను చూస్తున్నాం? వంటి వివరాల ఆధారంగా మనకు ఉపయోగపడే ప్రకటనలను చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఇటీవల కొత్త బైక్‌ల గురించి గూగుల్‌లో వెతికారనుకుందాం. ఆ తర్వాత ఇతర వెబ్‌సైట్లు చూస్తున్నప్పుడు కూడా బైక్‌లకు సంబంధించిన ప్రకటనలు కనిపించే అవకాశం ఉంటుంది. అంటే మన ఆసక్తులను అర్థం చేసుకుని, వాటికి సంబంధించిన ప్రకటనలను చూపించడంలో గూగుల్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ప్రకటనలు ఇచ్చే కంపెనీలకు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉన్న వినియోగదారులను చేరుకోవడం సులభమవుతుంది.

35
యూట్యూబ్ ద్వారా కూడా భారీ ఆదాయం

గూగుల్‌కు చెందిన యూట్యూబ్ కూడా ఆ సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టే ముఖ్యమైన వేదిక. యూట్యూబ్‌లో మనం వీడియోలు చూసేటప్పుడు మధ్యలో లేదా ప్రారంభంలో ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ప్రకటనల కోసం కంపెనీలు యూట్యూబ్‌కు డబ్బులు చెల్లిస్తాయి. అంతేకాదు, యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఇందులో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ తీసుకున్నవారు ప్రకటనలు లేకుండా వీడియోలు చూడటంతో పాటు మరికొన్ని ప్రత్యేక సదుపాయాలను పొందవచ్చు. యూట్యూబ్‌లో కోట్లాది మంది వీడియోలు చూస్తుండటంతో ప్రకటనల ద్వారా గూగుల్‌కు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది.

45
గూగుల్ క్లౌడ్, ప్లే స్టోర్ ద్వారా సంపాదన

ప్రకటనలతో పాటు గూగుల్ ఇతర సేవల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. ఇందులో గూగుల్ క్లౌడ్ (Google Cloud) ముఖ్యమైనది. వివిధ కంపెనీలు తమ డేటాను భద్రపరచడం, వెబ్‌సైట్లు నిర్వహించడం, ఆన్‌లైన్ సేవలను అందించడం కోసం గూగుల్ క్లౌడ్ సేవలను ఉపయోగిస్తాయి. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తాయి. అలాగే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్స్, గేమ్స్, డిజిటల్ కంటెంట్ కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్లపై కూడా గూగుల్‌కు ఆదాయం వస్తుంది. కొన్ని యాప్స్‌లో ప్రీమియం సేవలు పొందాలన్నా, ప్రత్యేక ఫీచర్లు ఉపయోగించుకోవాలన్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి లావాదేవీల్లో నిబంధనల ప్రకారం గూగుల్‌కు కొంత వాటా లభిస్తుంది.

55
గూగుల్ వర్క్‌స్పేస్‌తో అదనపు ఆదాయం

గూగుల్ అందించే జీమెయిల్, గూగుల్ డ్రైవ్, డాక్స్, షీట్స్ వంటి సేవలను చాలామంది ఉచితంగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటికి ప్రత్యేకమైన ప్రొఫెషనల్ వెర్షన్లు కూడా ఉన్నాయి. వీటిని Google Workspace పేరుతో అందిస్తోంది. ముఖ్యంగా వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ సేవలను సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉపయోగిస్తాయి. ఇందులో ఎక్కువ స్టోరేజ్, సంస్థల కోసం ప్రత్యేక ఈమెయిల్, టీమ్‌తో కలిసి పనిచేసే సదుపాయాలు వంటి ఫీచర్లు ఉంటాయి. వీటి ద్వారా కూడా గూగుల్‌కు ఆదాయం వస్తుంది.

మొత్తంగా చూస్తే.. గూగుల్ మనకు సెర్చ్, జీమెయిల్ వంటి అనేక సేవలను ఉచితంగా అందిస్తున్నప్పటికీ, ప్రకటనలు, యూట్యూబ్, క్లౌడ్ సేవలు, యాప్స్, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. మనం ఉచితంగా ఉపయోగించే సేవల వెనుక ఇంత పెద్ద వ్యాపార వ్యవస్థ ఉందన్నమాట.

Read more Photos on
click me!

Recommended Stories