
ఆపిల్ ఇప్పటికే ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ, ఈ లేటెస్ట్ లైనప్‌లో స్టాండర్డ్ ఐఫోన్ 18 మాత్రం ఇంకా కనిపించలేదు. ఆపిల్ ఈ ఏడాది తన లాంచ్ స్ట్రాటజీని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్‌లో రావాల్సిన రెగ్యులర్ మోడల్‌ను 2027 వసంతకాలానికి వాయిదా వేసినట్లు సమాచారం.
వెయిటింగ్ కాస్త ఎక్కువైనా, కొత్త 2nm A20 ప్రాసెసర్, ఎక్కువ ర్యామ్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రాబోతోందని ప్రారంభ లీక్స్ చెబుతున్నాయి. అయితే, కెమెరాలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటివరకు ఐఫోన్ 18 గురించి లీక్ అయిన పూర్తి వివరాలు గమనిస్తే..
సెప్టెంబర్ 2026లో జరిగిన ఈవెంట్లో యాపిల్ ప్రీమియం మోడళ్లను పరిచయం చేసింది, కానీ రెగ్యులర్ వెర్షన్‌ను మాత్రం ఆపేసింది. ఆ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డుయోను ఆవిష్కరించింది. ఇప్పుడు స్టాండర్డ్ ఐఫోన్ 18 మార్చి 2027 ప్రాంతంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటే ఐఫోన్ 18e, సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
లాంచ్ ఆలస్యం కావడమే కాదు, ధర పెరగనుందని టెక్ వర్గాల టాక్. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ ప్రకారం, అమెరికాలో ఐఫోన్ 18 ప్రారంభ ధరను యాపిల్ 100 డాలర్లు పెంచి 999 డాలర్లకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే, భారత్‌లో దీని ధర దాదాపు రూ. 1 లక్ష మార్కుకు చేరుకోవచ్చు.
గతంలో ఐఫోన్ 17 అమెరికాలో 799 డాలర్లకు లాంచ్ అవ్వగా, సెప్టెంబర్ 2026లో దాని ధరను 100 డాలర్లు పెంచారు. భారత్‌లో ఐఫోన్ 17 రూ. 79,900 వద్ద లాంచ్ అయి, ఆ తర్వాత రూ. 99,900కు పెరిగింది. ఐఫోన్ 18 భారత్ ధరపై ఇంకా అధికారిక స్పష్టత లేకపోయినా, అమెరికాలో ధర పెరిగితే ఇక్కడ కూడా భారం తప్పదు.
ఫోన్ బయటి లుక్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, లోపలి హార్డ్వేర్పై ఆపిల్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. 2nm టెక్నాలజీతో తయారైన యాపిల్ A20 ప్రాసెసర్‌ను ఐఫోన్ 18లో వాడనున్నారు. పాత చిప్‌తో పోలిస్తే ఈ కొత్త చిప్ సుమారు 30 శాతం తక్కువ పవర్‌ను వాడుకుంటుందని అంచనా.
దీనివల్ల బ్యాటరీ పరిమాణం పెంచకపోయినా, ఛార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది. అలాగే ర్యామ్ విషయానికొస్తే, కొన్ని లీక్స్ 12GB ర్యామ్ ఉంటుందని చెబుతుండగా, ప్రముఖ అనలిస్ట్ మింగ్ చి కువో మాత్రం 9GB ర్యామ్ ఉండొచ్చని అంచనా వేశారు. ఐఫోన్ 17లోని 8GB ర్యామ్ కంటే ఇది ఎక్కువే కాబట్టి, కష్టమైన ఏఐ టాస్క్‌లను ఈ ఫోన్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది.
కెమెరా హార్డ్‌వేర్ విషయంలో పాత ఫార్ములానే కొనసాగించనుందని సమాచారం. ఐఫోన్ 17 తరహాలోనే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. సెల్ఫీల కోసం సెంటర్ స్టేజ్ సపోర్ట్‌తో 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా రావచ్చు. ప్రో మోడళ్లలో ఉండే వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీ ఇందులో ఉండకపోవచ్చు. ఇప్పటికే ఐఫోన్ 17లో 4K 60fps వీడియో రికార్డింగ్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్ పరంగా ప్రో మోడళ్ల తరహాలో వెనుకవైపు కాస్త ఎత్తుగా ఉండే కెమెరా బంప్ రావొచ్చని లీక్ అయిన డమ్మీ యూనిట్ ద్వారా తెలుస్తోంది. కెమెరా కంట్రోల్ బటన్‌ను టచ్ సెన్సిటివ్ బదులు, లైట్, గట్టి ప్రెస్‌లకు వేర్వేరుగా స్పందించే ప్రెజర్ బేస్డ్ మెకానికల్ సిస్టమ్‌గా మార్చవచ్చు. ముందువైపు 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేనే కొనసాగుతుంది. చిన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కేవలం ప్రో సిరీస్‌కే పరిమితం కావచ్చు.
బ్యాటరీ వివరాలు, iOS 27 బ్యాటరీ సామర్థ్యంపై యాపిల్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఐఫోన్ 17లో ఉన్న సుమారు 3,692mAh బ్యాటరీనే ఇందులోనూ ఉండే అవకాశం ఉంది. అయితే A20 చిప్ పవర్ సేవింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ మెరుగ్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికొస్తే, ఐఫోన్ 18 నేరుగా iOS 27తో రాబోతోంది. గూగుల్ సహాయంతో డెవలప్ చేసిన మరింత స్మార్ట్ సిరి ఏఐ ఇందులో ఉండనుంది. ఇది మనం మాట్లాడే భాషను అర్థం చేసుకుని, స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని బట్టి ఇతర యాప్స్‌లో కూడా పనులు చేసిపెడుతుంది. యాపిల్ ఇప్పటివరకు ఐఫోన్ 18 లాంచ్ డేట్, ధర లేదా స్పెసిఫికేషన్లను అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుత లీక్స్ ఈ వివరాలు వెల్లడించాయి.