ఫేస్‌బుక్ పేరు మారబోతోందా.. త్వరలో ప్రకటించనున్న మార్క్ జుకర్‌బర్గ్..

First Published Oct 20, 2021, 11:40 AM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్(Facebook) గత 17 సంవత్సరాలుగా అదే పేరుతో పిలువబడుతోంది, కానీ ఇప్పుడు దాని రీ-బ్రాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్ పేరు మారబోతోందని, అధికారిక ప్రకటన త్వరలో ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్?(Mark Zuckerberg) చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే వారం ఫేస్‌బుక్‌పై  జరిగే ఒక ఈవెంట్‌లో కొత్త పేరు ప్రకటించవచ్చు.

The Verge నివేదిక ప్రకారం అక్టోబర్ 28న ఫేస్‌బుక్ సమావేశం జరగబోతోంది, దీనిలో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ కొత్త పేరును ప్రకటించవచ్చు. ఫేస్‌బుక్ యాప్ కాకుండా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఓకులస్ వంటి కంపెనీ ఇతర ఉత్పత్తుల పేర్లకు సంబంధించి పెద్ద ప్రకటనలు ఉండవచ్చని నివేదికలో తెలిపింది, అయితే ఈ నివేదికపై ఇంకా ఫేస్‌బుక్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ వారం ప్రారంభంలో ఫేస్‌బుక్ ఇప్పుడు మెటావర్స్ కంపెనీగా మారబోతోందని, దీని కోసం 10,000 మందిని నియమించుకున్నామని, భవిష్యత్తులో ఇతర నియమకాలు కూడా ఉంటాయని చెప్పారు. మెటావర్స్(metaverse) అనేది వర్చువల్ ప్రపంచాన్ని సూచిస్తుంది, దీనిలో ప్రజలు భౌతికంగా లేకపోయినా ఉనికిలో ఉంటారు. మెటావర్స్ అనే పదం వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీని పోలి ఉంటుంది.

ఫేస్‌బుక్ మాత్రమే కాదు, ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు మెటావర్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయే కాలంలో ఫేస్‌బుక్‌ను సోషల్ మీడియా కంపెనీగానే కాకుండా మెటావర్స్ కంపెనీగా ప్రజలు తెలుసుకుంటారని మార్క్ జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.

ఫేస్‌బుక్  రియల్ అండ్ వర్చువల్ ప్రపంచ అనుభవాలను రూపొందించడానికి  రానున్న ఐదు సంవత్సరాలలో భారీగా నియమకాలు చేపట్టనుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్‌తో సహా ఇతర దేశాలలో ఉద్యోగులను  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో  నియమించనుంది.

click me!