AI photos
ప్రతి ఒక్కరికీ కంట్లో నుంచి నీరే..
ఇప్పటి వరకు ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, క్యాండిడ్, సినిమాటిక్ వీడియోలు తీయడం వంటివి అనేక శుభకార్యాల్లో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి చనిపోయిన వారిని కూడా శుభకార్యాలకు వచ్చినట్లుగా చూపిస్తున్నారు. అంతేకాదు వారు పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించినట్లుగా మ్యారేజ్‌కి ముందే ఏఐతో వీడియోలను తయారు చేస్తున్నారు. వీటిని పెళ్లి సమయంలో తిరిగి పెద్ద స్క్రీన్‌పై ప్లేచేసి అందరికీ మధురాభూతి కలిగిస్తున్నారు. వీడియోలకు సినిమా పాటలను జోడించి కంట్లో నుంచి నీరు తెప్పిస్తున్నారు.
wedding photo shoot
పెళ్లిచూపుల నుంచి ఫొటోషూట్‌లే..
ఫొటోగ్రఫీలో కూడా నూతన టెక్నాలజీ రావడంతో ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, క్యాండిడ్, సినిమాటిక్ వీడియోలు వంటి వాటిపై ప్రస్తుతం అందరికీ ఆకర్షణ పెరుగుతోంది. ప్రస్తుతం ఫొటోగ్రఫీ సినిమాటిక్‌గా మారిపోయింది. నేటి తరం పెళ్లి చూపుల నుంచే ఫొటోలు, వీడియోలు అందంగా తీయించుకుని మధురజ్ఞాపకంగా ప్రతి మూమెంట్‌ని భద్రపరుచుకుంటున్నారు. ఇక పెళ్లిలో క్యాండిడ్ ఫొటోలు తీయించుకుంటున్నారు. క్యాండిడ్ అంటే పెళ్లి కొడుకు, కుమార్తె శుభకార్యం చేసుకుంటున్న వేళ వారి మధ్య జరిగే ముచ్చట్లు, అల్లరి చేష్టలు, ముద్దుముద్దు మాటలు వీటన్నింటినీ కొన్ని వారికి తెలియకుండా, కొన్ని ప్లాన్ చేసి వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు దీన్నే క్యాండిడ్ ఫొటో గ్రఫీ అని పిలుస్తారు. ఇలాంటి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం క్యాండిడ్ ఫొటోలు, వీడియోల కోసం రూ.8 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తున్నారంట. వీటితోపాటు హల్దీ, ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ ఇలా అనేక రకాలుగా ఫొటోషూట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
wedding photo shoot
ట్రెండింగ్‌లో ఏఐ టెక్నాలజీ..
ప్రస్తుతం అన్నిరంగాల్లో ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఫొటోగ్రఫీలో కూడా ఏఐ గేమ్ ఛేంజర్‌గా మారింది. ఏఐ టెక్నాలజీ వాడి చనిపోయిన వారిని పెళ్లిలో ప్రత్యక్షం చేయిస్తున్నారు. చనిపోయిన వారు వచ్చి ఆశీర్వదించడం, వెనక నుంచి వచ్చి భుజాలపై చేయి వేయడం, ఆత్మీయంగా హగ్ చేసుకోవడం వంటివన్నీ చాలా నాచురల్‌గా ఉన్నట్లు అనిపించేలా వీడియోలు తీసి పెళ్లిలోనే బంధువుల సమక్షంలో ప్రదర్శిస్తున్నారు. తమని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారిని ఒక్కసారిగా చూసిన నవదంపతులు, బంధువులు భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది పెళ్లిల్లో ఇలాంటి వీడియోలను అడుగుతున్నారని ఫోటోగ్రాఫర్లు చెబుతున్నారు.
wedding photo shoot
నగరాల్లో యువతకు మెరుగైన ఉపాధి..
శుభకార్యాల రూపంలో ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ వంటి రంగాల్లో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో పెళ్లికి మధ్యతరగతి ప్రజలు వారి బడ్జెట్‌ను బట్టి సుమారు రూ.2 నుంచి 3 లక్షల వరకు కేటాయిస్తున్నారు. డబ్బున్న వారు మాత్రం సుమారు రూ.10 నుంచి 25 లక్షల వరకు ఫొటోషూట్‌ల కోసం ఖర్చు చేస్తున్నారట. ఇక సెలబ్రిటీలు కనీసం రూ.40 లక్షలపైనే షూట్‌ల కోసం ఖర్చు చేస్తున్నారంట. పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా మహానగరాల్లో కూడా స్టూడియోలు ఏర్పాటు చేసుకుంటున్నామని కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన యూసీ ఫొటోగ్రాఫిక్స్ నిర్వాహకులు ఉత్తేజ్ చెబుతున్నారు. ఇక్కడి నుంచి యువత హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి మెరుగైన ఉపాధి పొందుతున్నారంటున్నారు.
wedding photo shoot
రూ.లక్ష నుంచి 20 లక్షల వరకు ఖర్చు..
ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదని అంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు ఉండగా.. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా వివాహాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫొటోగ్రఫీకి డిమాండ్ ఏర్పడింది. తక్కువలో తక్కువ రూ.లక్ష నుంచి 20 లక్షల వరకు ఫొటోషూట్‌లకు నేడు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు అనేక మందికి కూడా ఉపాధి లభించనుంది.